
ఒకరోజు శాస్త్రవేత్తలుగా పాఠశాల విద్యార్థులు
ఫిరంగిపురం: మండలంలోని వేములూరిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 8, 9వ తరగతుల విద్యార్థులు ఐదుగురు జాతీయ స్థాయి వన్డే యాజ్ ఏ సైంటిస్ట్ ప్రోగ్రామ్‌కు ఎంపిక అయినట్లు పాఠశాల హెచ్‌ఎం లింగిశెట్టి సాంబయ్య మంగళవారం తెలిపారు. పాఠశాలకు చెందిన బి.అనుశ్రీ,, షేక్ ఖాసీం, షేక్ మస్తాన్‌వలి, కె.ప్రశాంత్, షేక్ అన్వర్‌లను ఇటీవల ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఎంపిక చేశారని చెప్పారు. జిగ్యాసా ప్రోగ్రామ్‌లో భాగంగా దేశంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), అంతర్జాతీయ స్థాయి పరిశోధన సంస్థ (భవనేశ్వర్)లో ఈ నెల 24న విద్యార్థులు అక్కడున్న శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తారని తెలిపారు. విద్యార్థులను పలువురు ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ బి.నాగరాజులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.రామాంజనేయులు, రాజులు పాల్గొన్నారు.
రైలు ఢీకొని ఉద్యోగి మృతి
తెనాలి రూరల్: రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు ఆర్ అండ్ బీ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న జాన్‌బాబు(50) మంగళవారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. జాన్‌బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనాస్థలిని రైల్వే పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ ఎస్‌ఐ జి. వెంకటాద్రిబాబు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన దినేష్ (20) మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కళాశాల నుంచి తన స్నేహితుడు గణేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై గుంటూరుకు బయలుదేరాడు. చౌడవరం వద్ద హైవేపై డివైండర్ రైలింగ్‌కు ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం ఢీకొంది. దినేష్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్‌కు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. మృతుని తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
రేవులో పడి వ్యక్తి మృతి
నిజాంపట్నం: వేటకు వెళ్తూ ప్రమాదవశాత్తు రేవులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇది. అడవులదీవి ఎస్‌ఐ బాబూరావు వివరాల మేరకు కొత్తపాలెం పంచాయతీ శారదానగర్‌కు చెందిన బాలకోటయ్య (23) సముద్రంలో వేటకు వెళ్ళేందుకు సోమవారం రేవులో పడవపై వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి రేవులో పడ్డాడన్నారు. గల్లంతైన బాలకోటయ్య మృతదేహాన్ని మంగళవారం రేవు ఒడ్డున గుర్తించామన్నారు. మృతుని సోదరుడు బాల శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో టైలర్ షాపు దగ్ధం
మేదరమెట్ల: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్ సమీపంలోగల టైలర్ దుకాణం సోమవారం అర్ధరాత్రి మంటల్లో కాలిపోయింది. బాధితులు తెలిపిన సమాచారం మేరకు.. సోమవారం రాత్రి దుకాణం తలుపులు వేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో స్థానికులు ఫోన్ చేసి షాపులో మంటలు వస్తున్నాయని చెప్పటంతో అక్కడకు వచ్చే సరికి దుకాణం పూర్తిగా కాలిపోయింది. దుకాణంలో ఉన్న బట్టలు, సామాగ్రి దగ్ధమయ్యాయని.. వాటి విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని వాపోయాడు.

ఒకరోజు శాస్త్రవేత్తలుగా పాఠశాల విద్యార్థులు

ఒకరోజు శాస్త్రవేత్తలుగా పాఠశాల విద్యార్థులు

ఒకరోజు శాస్త్రవేత్తలుగా పాఠశాల విద్యార్థులు