
సమాజంలో సమానత్వమే పీ–4 లక్ష్యం
గుంటూరు వెస్ట్: పేదరిక నిర్మూలన కోసం సమాజంలో అట్టడుగున ఉన్న పేదలను ఆర్థికంగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీ–4 పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పీ4 కార్యక్రమంలో బంగారు కుటుంబాల కోసం స్వల్ప కాలిక, దీర్ఘకాలిక సహాయాలను మార్గదర్శులు మళ్లించాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఇప్పటికే లక్ష వరకు బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు. ప్రస్తుతం గ్రామ సభల ద్వారా వారికి కావాల్సిన అవసరాలను సర్వే చేస్తున్నారని పేర్కొన్నారు. ఆగస్టు నాటికి బంగారు కుటుంబాల పూర్తి వివరాలు అందుతాయని చెప్పారు. మార్గదర్శులు వారి పరిసర ప్రాంతాల్లోనే వ్యక్తిగతంగా కనీసం ఒక కుటుంబాన్ని, సంస్థలు ఐదు కుటుంబాలను దత్తత తీసుకోవాలన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లోగానీ, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులను సంప్రదించాలన్నారు. పీ4 వెబ్‌సైట్‌లోనూ మార్గదర్శిగా రిజిస్టరైన బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలన్నారు. జేసీ మాట్లాడుతూ ఉన్నత వర్గం వారు అవకాశం ఉన్నంత వరకు విద్య, వైద్యంతోపాటు, ముఖ్యమైన అవసరాలు కావాల్సిన వారికి తీర్చాలన్నారు. డీఈఓ రేణుక, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డెప్యూటీ స్టాటికల్ అధికారి శౌరిరాజు, డీపీఓ శేషశ్రీ, పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి