
ఇక.. రెండు పూట్ల హాజరు
సత్తెనపల్లి: ఉపాధి హామీ కూలీలకు ఇకపై రెండు పూట్ల హాజరు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఉదయం, సాయంత్రం చిత్రాలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆయా మస్టర్ల ఆధారంగానే కూలీలకు వేతనాలు చెల్లిస్తారు. ఉపాధి హామీ పనుల హాజరులో జరుగుతున్న అవకతవకలను నివారించేందుకు కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు క్షేత్ర సహాయకులు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్) ద్వారా ఉదయం, మధ్యాహ్నం చిత్రాలు తీసి అప్‌లోడ్ చేసేవారు. ఈ విధానంలో కూలీలు ఒక పూట పని చేసి రెండు పూటలా చేసినట్లు నమోదు చేసుకునే వారు. దీంతో సామాజిక ఆడిట్లు జరిగినప్పుడు హాజరులో లోపాలు ఉండటంతో క్షేత్ర సహాయకులకు జరిమానాలు విధించేవారు. కొత్త విధానంలో ఉదయం, సాయంత్రం హాజరు చిత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా కూలీలు పని ప్రదేశంలో ఉండాల్సి వస్తుంది.
మస్టర్ల ఆధారంగానే ఉపాధి కూలీలకు వేతనాలు పని ప్రదేశంలో కూలీలు ఉండాల్సిందే