వి‘తంతు’ పింఛన్ల డ్రామా ! | - | Sakshi
Sakshi News home page

వి‘తంతు’ పింఛన్ల డ్రామా !

Jul 25 2025 4:35 AM | Updated on Jul 25 2025 4:35 AM

వి‘తం

వి‘తంతు’ పింఛన్ల డ్రామా !

నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌) : కూటమి ప్రభుత్వ ప్రకటనలకు, ఆచరణకు పొంతన ఉండటం లేదు. కేబినెట్‌ సమావేశాల్లో ఆమోదించిన పనులు, పథకాలు కూడా అమలుకాని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా కేటగిరీలో పింఛన్‌ పొందుతున్న భర్త మృతి చెందితే, అతని భార్యకు మాత్రమే మంజూరు చేసేలా కొత్త నిబంధన విధించింది. ఈ లెక్కన జిల్లాలో 3,437 మందికి స్పౌజ్‌ పింఛన్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. జూన్‌ నుంచి మంజూరు చేస్తామని కూడా హడావుడి ప్రచారాలు చేశారు. లబ్ధిదారులు ఎంతో ఆశ పడ్డారు. డబ్బులు చేతికందే సమయానికి వెనక్కి వెళ్లాయంటూ సచివాలయ సిబ్బంది చెప్పడంతో నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఇంత మోసం చేస్తుందా ? అంటూ మండిపడుతున్నారు.

దరఖాస్తులు స్వీకరిస్తే ఒట్టు

కూటమి అధికారం చేపట్టిన తరువాత కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. కనీసం అర్హుల నుంచి దరఖాస్తుల కూడా స్వీకరించిన పాపాన పోలేదు. మూడు నెలల కిందట స్పౌజ్‌ కేటగిరీ పేరుతో వితంతు పింఛన్ల మంజూరు అంటూ అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎవరైనా వ్యక్తి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పొందుతూ డిసెంబర్‌ 2023 నుంచి అక్టోబర్‌ 2024 మధ్య చనిపోతే అతని భార్యను స్పౌజ్‌ కేటగిరీ కింద అర్హురాలిగా గుర్తిస్తామని చెప్పారు. జిల్లాలో 3,437 మంది దరఖాస్తు చేసుకున్నారు. మే చివరలో, జూన్‌ మొదటి వారంలో, జూలై మొదటి వారంలో ఇస్తామంటూ ప్రగల్భాలు పలికారు. తీరా ప్రభుత్వం మొండి చేయి చూపింది.

50 ఏళ్లకే పింఛన్‌ ఊసేది?

గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 2,50,624 మందికి పింఛన్లు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పోలిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరణాలు, ఇతర కారణాలతో సుమారు 8వేల దాకా పింఛన్లు ఆగిపోయాయి. ఇవి కాకుండా కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్‌ మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఇంత వరకు ప్రభుత్వం దీని ఊసే ఎత్తక పోవడంతో 2లక్షల మంది దాకా పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మొండి చేయి స్పౌజ్‌ కేటగిరీలో ఇస్తామంటూ హడావుడి జిల్లాలో 3,437 మందికి ఇస్తామంటూ రెండు నెలల కిందట ప్రచారం తీరా ఇప్పుడు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

నిధులు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

స్పౌజ్‌ పింఛన్‌ నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఎప్పుడు ఇస్తుందో మాకు తెలియదు.

– లక్ష్మి, ఏపీఓ(పింఛన్లు), డీఆర్‌డీఏ

ప్రభుత్వం

మాట నిలబెట్టుకోవాలి

గత సంవత్సరం నా భర్త చనిపోయాడు. ఆయనకు పింఛన్‌ వస్తోంది. స్పౌజ్‌ కేటగిరి కింద పింఛన్‌ మంజూరు చేస్తున్నారు అంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా. రెండు నెలల నుంచి ఇదిగో అదిగో అంటూ సిబ్బంది చెబుతున్నారు. ఇంత వరకు ఇంత వరకు మంజూరు కాలేదు. సచివాలయ సిబ్బంది వచ్చి పింఛన్‌ వెనక్కి వెళ్లిందని..ఇప్పట్లో రాదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

– సుందరమ్మ, నెహ్రూనగర్‌

వి‘తంతు’ పింఛన్ల డ్రామా ! 1
1/1

వి‘తంతు’ పింఛన్ల డ్రామా !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement