
వైభవంగా తిరుప్పావడ సేవ
దుగ్గిరాల: స్థానిక పసుపు యార్డు సమీపంలో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం గురు పుష్యమి పర్వదినంగా సందర్భంగా తిరుప్పావడ సేవను వైభవంగా నిర్వహించారు. పులిహోర, రుచికరమైన ఆహార పదార్థాలతో అలంకరించిన స్వామి రూపాన్ని భక్తులు దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఏర్పాట్లను ఆలయ కమిటీ పర్యవేక్షించింది.
నేటి నుంచి తాత్కాలికంగా రైల్వే గేటు మూత
తాడేపల్లి రూరల్ : మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఇప్పటం– పెదవడ్లపూడి మధ్య రైల్వే గేట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విజయవాడ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మంగళగిరి, తాడేపల్లి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పెదవడ్లపూడి, ఇప్పటం, పెదవడ్లపూడి కృష్ణా కెనాల్ మధ్య రైల్వేట్రాక్ మరమ్మతులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ మార్గంలో ప్రయాణంలో వారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
నేడు అమ్మవారికి స్వర్ణ కవచాలంకారం
మంగళగిరి టౌన్: మంగళగిరి నగర పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం నుంచి ఆగస్టు 22 వరకు శ్రావణ మాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. శ్రావణ మాసం మొదటి రోజులో భాగంగా శుక్రవారం రాజ్యలక్ష్మి అమ్మవారికి స్వర్ణ కవచాలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నెల రోజుల పాటు భక్తుల కోసం హోమం, సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.
‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో మంగళగిరికి 11వ ర్యాంక్
తాడేపల్లి రూరల్: స్వచ్ఛ భారత్ అమలులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగంలో 2024–2025 సంవత్సరానికి గాను మంగళగిరి తాడేపల్లి నగరపాలక (ఎంటీఎంసీ) సంస్థకు 11వ ర్యాంక్ లభించినట్లు కమిషనర్ అలీమ్‌బాషా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పారిశుద్ధ్య విభాగంలో సర్వే, టెస్ట్ ప్రాక్టీస్, సిటిజన్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించిందని తెలిపారు. ఇందులో ఎంటీఎంసీ 7,354 మార్కులు సాధించి దేశంలో 386ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించిందని వివరించారు. తాడేపల్లి 5,389 మార్కులు సాధించి దేశంలో 634వ ర్యాంకు, రాష్ట్రంలో 44వ స్థానంలో నిలిచిందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
యోగా పోటీలకు మద్దిరాల జేఎన్‌వీ సన్నాహాలు
ఈనెల 29 నుంచి ప్రారంభం
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: దక్షిణ భారతస్థాయి యోగా పోటీలు ఈనెల 29వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు మద్దిరాల పీఎంశ్రీ జేఎన్‌వీ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహరావు గురువారం తెలిపారు. ఏటా జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ పోటీలకు తమ విద్యాలయం వేదిక కానుందని తెలిపారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల్లోని జేఎన్‌వీ విద్యార్థులకు అండర్–14, అండర్–17, అండర్ –19 విభాగాల్లో ఈ పోటీల నిర్వహణ ఉంటుందన్నారు. 29,30,31 తేదీల్లో మూడు రోజులు జరిగే పోటీలకు సౌత్ జోన్ పరిధిలోని ఆయా విద్యాలయాల నుంచి సుమారు 340 మంది విద్యార్థులు ఈ యోగా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.