
కారు అద్దాలు పగలకొట్టి చోరీ
మంగళగిరి టౌన్ : రెండు వేర్వేరు కారుల అద్దాలు పగలకొట్టి ల్యాప్‌టాప్‌లు చోరీ చేసిన ఘటన మంగళగిరిలో మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు డీబీఎస్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హెడ్ శ్రీనివాస్ సిల్వరాజ్ విధులు నిమిత్తం విజయవాడ బ్యాంకుకు వచ్చారు. అక్కడ పని ముగించుకుని విజయవాడ క్లస్టర్ హెడ్ సుధాకర్‌తో పాటు తన సిబ్బందితో గుంటూరు బ్యాంకుకు బయలుదేరారు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనం చేసేందుకు చినకాకానిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న భోజన హోటల్ వద్ద ఆగారు. అదే సమయంలో బద్వేల్‌కి చెందిన సాయిరాం అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో ఎర్రబాలెంలో తాను కొనుగోలు చేసిన స్థలం చూడడానికి వచ్చి భోజనం చేసేందుకు వీరు కూడా వారి కారులో హోటల్‌కు చేరుకున్నారు. వీరిద్దరూ కార్లను పార్కింగ్ చేసి భోజనం చేయడానికి లోపలికి వెళ్లారు. భోజనం చేసి అనంతరం బయటకు వచ్చి చూడగా కారు అద్దాలు పగలకొట్టి ఉండడం గమనించారు. కారు లోపల పెట్టిన ల్యాప్‌టాప్, బ్యాగులు అపహరణకు గురిఅయినట్లు గుర్తించారు. శ్రీనివాస్ సెల్వరాజ్ కారులో ల్యాప్‌టాప్‌తో పాటు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉన్నాయని, సాయిరామ్ కారులో ల్యాప్‌టాప్‌తో పాటు సుమారు 5 వేల రూపాయలు నగదు, ఇంటి తాళాలు, బీరువా తాళాలు ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ల్యాప్‌టాప్‌లు, నగదు అపహరణ

కారు అద్దాలు పగలకొట్టి చోరీ