
క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి
పెదకాకాని(ఏఎన్‌యూ): విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం కడపలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాల ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరిగింది. 2025–26 సంవత్సరానికి గానూ 4, 5 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన ఎంపిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక ప్రక్రియను వర్సిటీ వ్యాయామ విద్యాశాఖ నిర్వహించింది. వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీపీఎస్ పౌల్‌కుమార్ వివరాలు తెలియజేస్తూ.. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ఎంపికై న 96 మంది విద్యార్థులు, 40 మంది విద్యార్థినీలు మొత్తం 136 మందికి గానూ 122 మంది హాజరయ్యారని అన్నారు. వారిని పలు అంశాల్లో పరీక్షించారు. కార్యక్రమానికి డైరెక్టర్‌లు రమణారావు, రవీంద్రనాధ్ హాజరయ్యారు. విద్యార్థుల సామర్థ్య పరీక్షలను వ్యాయామ విద్యాపరిశోధకులు నిర్వహించగా విద్యార్థులు సహాయ సహకారాలు అందించారు. ఈ పోటీల్లో నిర్ణీత ప్రమాణాలు సాధించిన వారు మాత్రమే డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్‌కు ప్రవేశం పొందుతారన్నారు.
7 నుంచి సీపీఐ మహాసభలు
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా సీపీఐ మహాసభలను ఆగస్టు 7, 8 తేదీలలో వినుకొండలో నిర్వహిస్తున్నట్టు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు తెలిపారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జిల్లా మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా నిర్వహిస్తున్న ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. 7వ తేదీన వినుకొండ ప్రధాన వీధుల్లో ర్యాలీ, సాయంత్రం 4 గంటలకు శివయ్య స్థూపం వద్ద బహిరంగ సభ, 8వ తేదీన ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి