
ఈసీ మార్గదర్శకాలను అమలు చేయాలి
గుంటూరు వెస్ట్: భారత ఎన్నికల సంఘం గతంలో నిర్వహించిన విధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించిన ఓటర్ల జాబితాను రూపొందించాలన్న ఆలోచనలో ఉందని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి తెలిపారు. దానికి అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో డీఆర్వో మాట్లాడుతూ.. దీనిపై త్వరలోనే ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విడుదల చేస్తుందన్నారు. పూర్తి సమాచారం అందిస్తామని తెలిపారు. పోలింగ్ బూత్‌లలో 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా, అదనంగా ఉండే ఓటర్లను సమీపంలోని పోలింగ్ బూత్‌లలో సర్దుబాటు చేసేలా ప్రక్రియను ప్రాథమికంగా పూర్తి చేశామన్నారు. దీనిపై నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలతో చర్చించి ఆమోదం కోసం ఎన్నికల సంఘానికి పంపిస్తామని తెలిపారు. బీఎల్వోల మార్పుచేర్పులకు ఇక నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. దీనికోసం ఈ నెల 31వ తేదీ నాటికి వివరాలు ఎన్నికల సంఘానికి పంపిస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలు నియమించే బూత్ లెవెల్ ఏజెంట్ నియామకాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆమోదం తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్‌ల వారీగా బీఎల్‌ఏల వివరాలు అందించాలని డీఆర్వో వివరించారు. సమావేశంలో విపత్తులు నిర్వహణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మీ కుమారి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ గంగారాజు, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, జీఎంసీ అడిషనల్ కమిషనర్ చల్లా ఓబులేసు, మల్లేశ్వరి పాల్గొన్నారు.
డీఆర్వో షేఖ్ ఖాజావలి