
ఎదురెదురుగా రెండు కార్లు ఢీ
తాడికొండ: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందాడు. నలుగురు మహిళలు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మండల పరిధిలోని నిడుముక్కల గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి అమరావతికి మ్యారేజ్ బ్యూరోకు సంబంధించిన నలుగురు మహిళలతో కారు వెళుతోంది. అమరావతి నుంచి గుంటూరు మరో కారు వస్తోంది. కళాజ్యోతి కార్యాలయం వద్దకు రాగానే ఎదురెదురుగా ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొదటి కారు డ్రైవర్ విజయవాడ యనమలకుదురుకు చెందిన పి.నాగేశ్వరరావు (38) మృతి చెందాడు. నలుగురు మహిళలు తీవ్రగాయాలపాలై స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో జీజీహెచ్‌కు తరలించారు. సీఐ వాసు, సిబ్బంది సహకారంతో నాగేశ్వరరావును మృతదేహాన్ని బయటకు తీశారు. మరో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వారంతా పెదకూరపాడు ఎమ్మెల్యేకు చెందిన బంధువులుగా సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.
ఒకరు మృతి, నలుగురు మహిళలకు గాయాలు

ఎదురెదురుగా రెండు కార్లు ఢీ