
కత్తితో దాడి: ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
చేబ్రోలు: పొలంలోని బొంగులు తగలబడటానికి కారణంపై జరిగిన వివాదంలో కత్తితో జరిగిన దాడిలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన చేబ్రోలు మండలం నారాకోడూరులో సోమవారం జరిగింది. చేబ్రోలు మండలం నారాకోడూరు దళితవాడ ప్రాంతానికి చెందిన తూమాటి సుమన్‌కు వేజండ్ల గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. అక్కడ పొలంలో కూరగాయల తోటకు ఉపయోగించే బొంగులను నిల్వ చేసి ఉంచారు. ఆదివారం రాత్రి సమయంలో వారి పొలంలోని బొంగులు తగలబడుతున్నాయి అని తెలిసి సుమన్ బంధువులను తీసుకొని వేజండ్ల గ్రామంలో గల పొలానికి వెళ్లి పరిశీలించి చూడగా బొంగులు తగలబడుతున్నట్లు గమనించారు. వీరి పొలం సమీపంలోనే ఉన్న ఎద్దు యలమందయ్య పొలంలో కూడా కొన్ని బొంగులు తగలబడుతున్నట్లు గుర్తించారు. ఇంటికి తిరిగి వచ్చి సోమవారం ఉదయం కమ్యూనిటీ హాల్ వద్ద కుర్చొని బొంగులు తగలబడిన విషయంపై మాట్లాడుతున్నారు. గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ వచ్చి ‘పొలంలో బొంగులు తగలబడటానికి కారణం నేను అని ప్రచారం చేస్తున్నారని వారితో వివాదానికి దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో తూమాటి సుమన్‌పై దాడి చేసి పొడవటంతో చేతికి, నడుమ బాగంలో గాయాలయ్యాయి. వరుసకు తమ్ముడు అయిన తూమాటి పృఽథ్వీరాజ్ అడ్డుకోవటానికి ప్రయత్నించగా అతనిపై కూడా దుర్గాప్రసాద్ దాడి చేసి కత్తితో ఛాతీ, వీపు భాగంలో పొడవటంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఇరువురిని స్థానికులు ఆటోలో వడ్లమూడిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్‌ఐ డి. వెంకటకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.