
వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ప్రభుత్వ ధ్యేయం
తెనాలి టౌన్: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొని రూ.30లక్షల విలువైన యంత్ర పరికరాలను రైతులకు అందజేశారు. డ్రోన్‌లు, కల్టివేటర్లు, తైవాన్ స్పెయిర్స్, సీడ్ డ్రీల్ వంటి పరికరాలను అందించారు. మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అందించే సమాచారాన్ని రైతు సేవా కేంద్రాల సిబ్బంది తెలియజేయాలని సూచించారు. ఈ ఏడాది తెనాలి నియోజకవర్గంలో 289 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.80 కోట్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీపై ఇస్తున్నట్లు తెలిపారు. యార్డు ప్రాంగణాన్ని రైతు సేవా కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. త్వరలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ యంత్రీకరణ విధానాన్ని అందిపుచ్చుకుని సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న యంత్ర పరికరాలను వినియోగించుకోవాలని కోరారు. రైతు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఐ.నాగేశ్వరరావు మాట్లాడుతూ రూ.30లక్షలు విలువ చేసే యంత్ర పరికరాలను రూ.10 లక్షల రైతుల భాగస్వామ్యంతో రూ.20 లక్షల సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని కోరారు. డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేయడం వలన మనిషి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. డ్రోన్ పరికరాలపై 80 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు రైతుమిత్ర గ్రూపుల ద్వారా రుణాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఆర్‌జెడి కె.శ్రీనివాసరావు, యార్డు సెక్రటరీ సుబ్బారావు, ఇన్‌చార్జి ఏడీఏ డి.రాజకుమారి, మండల వ్యవసాయశాఖ అధికారి కె.సుధీర్‌బాబు, పలువురు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.
సబ్సిడీపై రూ.30లక్షల విలువైన యంత్ర పరికరాలు పంపిణీ
రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ
మంత్రి నాదెండ్ల మనోహర్