
డ్రైవర్లను అటెండర్లుగా మార్చడం అన్యాయం
కొరిటెపాడు(గుంటూరు): వాణిజ్య పన్నుల శాఖలోని డ్రైవర్లను రివర్షన్ చేసి అటెండర్లుగా మార్చడం తీవ్ర అన్యాయమని, వారిని తిరిగి డ్రైవర్లుగా కొనసాగించాలని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం గుంటూరులోని జిల్లా సంఘ భవనంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ డ్రైవర్ల సంక్షేమానికి సంఘం తీవ్రంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు పదవీ కాలం ముగిసినా చట్ట విరుద్ధంగా కొనసాగుతున్నారని, సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సమావేశంలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఆయన ఇక సంఘంలో సభ్యుడు కాదని స్పష్టం చేశారు. అనంతరం పదవీ విరమణ చేసిన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవిని ఘనంగా సత్కరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డీఎస్. కొండయ్య, ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి, రాష్ట్ర కోశాధికారి వి.పాపారావు, నాయకులు వై.నాగరాజు, అబ్దుల్ హమీద్, ప్రసన్నాంజనేయకుమార్, అప్పలనాయుడు, ఈశ్వరరావు పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు