
భక్తులతో కిటకిటలాడిన నృసింహుని ఆలయం
మంగళగిరి టౌన్: పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవులు రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దిగువ సన్నిధిలో నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం పక్కనే ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ధ్వజ స్తంభం వద్ద దీపాలు వెలిగించారు. స్వామిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్‌లో నిలబడ్డారు. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దిగువ సన్నిధి నుంచి ఆటోలో ఎగువ సన్నిధికి వచ్చే భక్తులను మధ్యలోనే పోలీసులు ఆపేశారు. చేసేది లేక అక్కడి నుంచి నడిచి వెళ్లి స్వామి ని దర్శించుకున్నారు. ఉచిత దర్శనానికి రెండు నుంచి మూడు గంటల వరకు సమయం పట్టింది.