
పొగాకు బేళ్లకు నిప్పటించిన గుర్తు తెలియని వ్యక్తులు
కాకుమాను: గుర్తు తెలియని వ్యక్తులు పొగాకు బేళ్లకు నిప్పంటించిన సంఘటన పెదనందిపాడు మండలంలోని నాగభైరవారిపాలెంలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది.సేకరించిన సమాచారం మేరకు.. పరిటాలవారిపాలేనికి చెందిన ఓ రైతు బేళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి పొగ కమ్మేయడంతో స్థానికులు యజమానికి సమాచారం అందించారు.
మంటలను అదుపు చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చిలకలూరిపేట నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి అదుపులోకి తెచ్చారు. దీనిపై ఇంకా కేసు నమాదు కాలేదు.
పట్టపగలే నివాసంలో చోరీ
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): పట్టపగలు నివాసంలో చోరీ జరిగిన ఘటనపై ఫిర్యాదు అందింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. పాతగుంటూరు పోలీసుస్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్‌లో నివాసం ఉండే ఉప్పలపాటి అంకమ్మరావు తన కుటుంబంతో కలిసి అదే ప్రాంతంలో పలు పనుల నిమిత్తం వెళ్లారు. ఇంటికి వచ్చి చూసుకునే సరికి తలుపు తాళాలు పగులకొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా, పెట్టెలో ఉన్న రూ.8 లక్షల నగదు, రెండున్నర సవర్ల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పాతగుంటూరు పీఎస్ ఎస్‌హెచ్‌వో వెంకటప్రసాద్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందినట్లు తెలిపారు. అయితే పలు వాస్తవాలు తెలియాల్సి ఉందని, బాధితుల నుంచి పలు అనుమా నాలు నివృత్తి చేసుకున్న అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు.
కానిస్టేబుల్‌పై దాడి కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: తెనాలి వన్ టౌన్ కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు వేము నవీన్‌ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 24వ తేదీన చిరంజీవిపై వేము నవీన్ అలియాస్ కిల్లర్, చేబ్రోలు జాన్ విక్టర్, దోమ రాకేష్, బాబులాల్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇన్నళ్లు తప్పించుకు తిరుగుతున్న నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.