
లఘు ఉద్యోగ భారతి రాష్ట్ర అధ్యక్షుడిగా యోగిష్ చంద్ర
కొరిటెపాడు(గుంటూరు): లఘు ఉద్యోగ భారతి సర్వసభ్య సమావేశాన్ని అరండల్‌పేటలోని యోగి భవన్‌లో గురువారం నిర్వహించారు. ఇందులో గత రెండు సంవత్సరాల సంస్థ ప్రగతి, ఆర్థిక నివేదికను సమర్పించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా లఘు ఉద్యోగ భారతి అఖిల భారత సంఘటన్ కార్యదర్శి ప్రకాష్ చంద్ర హాజరయ్యారు. రాష్ట్ర లఘు ఉద్యోగ భారతి నూతన కమిటీని ప్రకటించి, మార్గనిర్దేశం చేశారు. ప్రకాష్ చంద్ర మాట్లాడుతూ దేశాభివృద్ధికి చిన్న, పెద్ద తరహా పరిశ్రమలు ముందుకు రావాలని కోరారు. చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ‘లఘు ఉద్యోగ భారతి’ జాతీయ స్థాయిలో పోరాడుతుందని వివరించారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా తులసి యోగిష్, ప్రధాన కార్యదర్శిగా అట్లూరి రమేష్, కోశాధికారిగా ధరణీష్ ధనికుల, ఉపాధ్యక్షులుగా కమల నయన్ బంగ్, రామలింగ, నల్లమోతు శివప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా గుత్తా సుబ్రహ్మణ్యేశ్వరరావు, కార్యదర్శులుగా అట్లూరి సునీతా నారాయణ, హరిదాసుల చంద్రశేఖర్, తోట రామకృష్ణ, దాట్ల తిరుపతి రాజుతో పాటు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా శ్రీధర్ చిట్టిప్రోలు, విఠల్ ప్రసాద్, మార్పు వెంకటేశం, పందిళ్లపల్లి ప్రవీణ్, రాజులపాటి వెంకట రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకాష్ చంద్ర ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న తులసి యోగిష్ చంద్రను పలువురు సభ్యులు అభినందించారు. తులసి గ్రూప్ అధినేత తులసి రామచంద్ర ప్రభు, పాపులర్ షూమార్ట్ అధినేత చుక్కపల్లి అరుణ్ కుమార్, రామచంద్ర బ్రదర్స్ అధినేత పుప్పాల సుబ్బారావు, ఆక్వా వాటర్ కంపెనీ అధినేత సాయి, సత్యా ఇంపెక్స్ అధినేత తోట రామకృష్ణలు వివిధ చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. వాటి పరిష్కారానికి శాయశక్తులా పనిచేస్తానని, అయితే సభ్యుల సంఖ్య పెరిగినప్పుడే మన వాణి గట్టిగా వినిపించటానికి అవకాశం ఉంటుందని ప్రకాష్ చంద్ర తెలిపారు. సభ్యుల సంఖ్య 150 నుంచి 1,000 వరకు పెరగడానికి కృషి చేస్తానని తులసి యోగిష్ చెప్పారు.