
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
పట్నంబజారు: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముందుకు సాగుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్ చెప్పారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ జిల్లా పరిశీలకులుగా నియమితులై తొలిసారి గుంటూరు వచ్చిన పోతిన మహేష్‌కు నేతలు ఘన స్వాగతం పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణు గోపాలరెడ్డి, విజయవాడ పార్లమెంట్ జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు. జిల్లా పరిధిలోని పలు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా జిల్లా, నగర, నియోజకవర్గాల కమిటీల నియామకం త్వరితగతిన పూర్తి చేసేలా చర్చించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా పరిశీలకులుగా తనపై నమ్మకంతో నియమించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి, కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామన్నారు. జూన్ 4న జరిగే వెన్నుపోటు దినోత్సవానికి సంబంధించి మంగళగిరిలోని నియోజకవర్గంలో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు
పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి సర్కార్ సంవత్సర పాలనలో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని, ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారని మండి పడ్డారు. ఈ ఏడాది కాలంలో కేవలం రాజకీయ కక్షలు, కార్పణ్యాలతో పాలన కొనసాగించారని పేర్కొన్నారు. జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఈ నెల 30 నుంచి జూన్ 3వ తేదీ వరకు గుంటూరు జిల్లా పరిధిలోని గుంటూరు– 1 , 2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని సన్నద్ధం చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తిరిగి హామీ ఇచ్చిన ఏకై క సీఎం చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. మిర్చి, పొగాకు, పత్తి రైతులను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, సీడీ భగవాన్, ఈమని రాఘవరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, తాడిబోయిన వేణు, విజయ్, నందేటి రాజేష్, మామిడి రాము, శేషగిరి పవన్‌కుమార్, బైరెడ్డి రవీంద్రారెడ్డి, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.