నెహ్రూనగర్: ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి అడ్మినిస్ట్రేటర్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కేరళ రాష్ట్రానికి చెందిన విశ్రాంత న్యాయమూర్తి జోసెఫ్ పీఎస్ నియమితులయ్యారు. ఏఈఎల్‌సీ రాజ్యాంగం ప్రకారం ఆమోదించబడిన అన్ని పాలక మండలలు, కమిటీలు ఏర్పడే వరకు అడ్మినిస్ట్రేటర్ కంట్రోలర్‌గా జోసఫ్ వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత జూనియర్ జడ్జి నేలటూరి జేసు రత్నకుమార్ కంట్రోలర్ కార్యదర్శిగా నియమితులయ్యారు.
శ్రీ భక్తాంజనేయస్వామి గ్రామోత్సవం
యర్రబాలెం(మంగళగిరి): మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యర్రబాలెంలో వేంచేసి ఉన్న భక్తాంజనేయస్వామి వారి విగ్రహ, జీవ, ధ్వజ, విమాన శిఖర ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా మంగళవారం స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు పలు రకాల పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ భక్తాంజనేయస్వామి వారిని ట్రాక్టర్‌పై అధిష్టంపచేసి పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
‘ఎయిర్ కూలర్లు’ ఏర్పాటు చేయిస్తాం..
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ స్ట్రోక్ యూనిట్‌లో పక్షవాత బాధితులు ఇబ్బంది పడకుండా వేసవి ఎండ నుంచి ఉపశమనం కోసం ఎయిర్ కూలర్లు తక్షణమే ఏర్పాటు చేయిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో పక్షవాత రోగులకు చికిత్స అందించే స్ట్రోక్ యూనిట్‌లో ఏసీలు పనిచేయక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంగళవారం ‘సాక్షి’ జిల్లా ఎడిషనల్‌లో రోగులకు సన్ ‘స్ట్రోక్’ శీర్షిక పేరుతో కథనం ప్రచురితమైంది. కేవలం స్ట్రోక్ బాధితులే కాకుండా చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ఏసీలు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఏసీలు మరమ్మతులు చేసినప్పటికీ మరలా పనిచేయడం మానేశాయి. ఈవిషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రోగులు ఫ్యాన్లు సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుమతులు ఇస్తామని వెల్లడించారు.
ఉండవల్లి కొండపై మంటలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లి కొండపై మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టి ఉండవచ్చని, లేదా ఈ వేసవి ఎండల కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతుండడంతో దిగువ భాగాన నివాసముంటున్న వారు భయాందోళనలకు గురవుతున్నారు. సుమారు 2 గంటలపాటు వ్యాపిస్తూనే ఉన్నాయి. స్థానికులు ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందజేశారు. గతంలో ఇలాగే కొండలపై మంటలు చెలరేగాయని ఈ మంటల వల్ల కొండప్రాంతం తగలబడుతుందని స్థానికులు అంటున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దుగ్గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్
19న ఉదయం 11 గంటలకు ఎన్నిక
దుగ్గిరాల: దుగ్గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మండల పరిషత్ అధికారులు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ ఎన్నిక జరుగుతుందని తెలిపారు. 15వ తేదీ లోపల ఫారం–5 ద్వారా ఎంపీటీసీ సభ్యులకు నోటీసులు ద్వారా తెలియజేసి తరువాత ప్రకటించిన విధంగా ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.