
17న స్టాండప్ కామెడీ షో పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈనెల 17న కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో ‘స్టాండ్ అప్ కామెడీ షో ‘ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి పి.రామచంద్రరాజు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలతోపాటు మనదేశంలోని మెట్రో నగరాలకు పరిమితమైన ‘స్టాండ్ అప్ కామెడీ షో‘ను మొదటిసారిగా గుంటూరు నగరానికి పరిచయం చేస్తున్నట్లు వివరించారు. వేదికపై ప్రదర్శకుడు నిలబడి సమాజంలో ఉన్న వివిధ అంశాలను ఎత్తి చూపిస్తూ వ్యంగ్య, హాస్య భరితమైన తన హావభావాల ద్వారా ఆహుతులను నవ్విస్తూ ఆకట్టుకోవడమే స్టాండప్ కామెడీ షో అని తెలిపారు. నవరసాల్లో ఒకటైన హాస్యరస కళను ప్రదర్శించేందుకు యువతీ, యువకులకు ఇది ఒక చక్కటి వేదిక అవుతుందని తెలిపారు. ఆసక్తితో కళాకారులుగా ఎదగాలనుకునే వారు భారతీయ విద్యాభవన్ కార్యాలయంతో పాటు 98854 21496, 83176 13187 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ప్రదర్శన తిలకించేందుకు ప్రవేశం ఉచితమని తెలిపారు.
కృష్ణా నదిలో మునిగి
ఆటో డ్రైవర్ మృతి
కొల్లిపర: కృష్ణా నదిలో మునిగి ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన కొల్లిపర పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తెనాలి చెంచుపేటకు చెందిన షేక్ బాజి(25)కి రెండేళ్ల కిందట వివాహమైంది. ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి కొల్లిపర కృష్ణానది తీరానికి వెళ్లాడు. ఇసుక క్వారీ సమీపంలో తన అన్నతో కలసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో చుట్టపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా, రాత్రికి మృతహం లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.30 అడుగుల వద్ద ఉంది. ఇది 137.3416 టీఎంసీలకు సమానం.