
పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను ఎస్‌జీటీలకే ఇవ్వాలి
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుభాని
సత్తెనపల్లి: ఎస్‌జీటీలుగా పని చేస్తూ ఒక్క పదోన్నతి కూడా పొందని వారు 30 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోడల్ ప్రాథమిక పాఠశాలలకు వారిని ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని ఎస్టీయూ ఏపీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.ఎం సుభాని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్లను పీఎస్‌హెచ్‌ఎంగా నియమించడం వల్ల వారికి సబ్జెక్ట్ మీదే పట్టు ఉంటుందన్నారు. ఒకటి నుంచి ఐదు తరగతుల్లో అన్ని సబ్జెక్ట్‌లు చెప్పాలంటే ఎస్‌జీటీలకే అనుభవం ఉందన్నారు. మిగులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హతను బట్టి +2, హైస్కూల్, ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తిని బట్టి అందరిని భర్తీ చేయాలని కోరారు. వీటిల్లో ఎస్‌జీటీలను నియమించకూడదని తెలిపారు. ప్రతి జిల్లాలో ఎస్‌జీటీలు వేల సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. బదిలీల్లో ఖాళీలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయని, ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో ఒక ఎస్‌జీటీ బదిలీ కోసం జిల్లాలో ఖాళీగా ఉన్న అన్నీ స్థానాలను ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇది సమయంతో కూడుకున్న అంశమని, ఎస్‌జీటీలకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ పెట్టాలని ఆయన కోరారు. ఎస్‌జీటీలకు ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో పెద్దఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు.