కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డు మిర్చి ఎగుమతి, దిగుమతి, కొట్ల కార్మిక సంఘం, మిర్చి యార్డు కాపలా వర్కర్స్ యూనియన్, ది గుంటూరు చిల్లీస్ కమీషన్ ఏజంట్స్ అసోసియేషన్‌ల అభ్యర్థన మేరకు ప్రస్తుత వేసవి సీజన్‌లో శనివారం నుంచి జూన్ 8వ తేదీ వరకు మిర్చి యార్డుకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో యార్డులో క్రయ విక్రయాలు జరపబడవన్నారు. జూన్ 9వ తేదీ నుంచి యథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో మిర్చి రైతులు తమ సరుకును యార్డుకు తీసుకురావద్దని సూచించారు. జూన్ 8వ తేదీ అర్ధ రాత్రి నుంచి రైతులు తమ సరుకును యార్డుకు తీసుకురావచ్చని ఆమె తెలిపారు.
ముగిసిన సదరం క్యాంప్
తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువ పత్రాలను పునః పరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. ఆర్థో, ఈఎన్‌టీ తదితర విభాగాలకు చెందిన వికలాంగులు వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమాన్ని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పర్యవేక్షించారు.
ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారి ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి తెలిపారు. ఫైనల్ మెరిట్‌లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే గుంటూరు వైద్య కళాశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. వివరాలకు గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.
సైనికుల కోసం ప్రత్యేక ప్రార్థనలు
గుంటూరు మెడికల్: ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేట శివాలయంలో, జీ.టీ.రోడ్‌లోని మస్తానయ్య దర్గాలో, గన్‌హాల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశానికి విజయం సిద్ధించాలని.. వీరమరణం పొందిన సైనికుల ఆత్మ శాంతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు డాక్టర్ శనక్కాయల అరుణ, నాయకులు సురేష్ కుమార్ జైన్, షేక్ రఫీ, మలిశెట్టి పవన్ కుమార్, రామకృష్ణ, పోకల పురుషోత్తం, శ్రీనివాస్, దేసు సత్యనారాయణ, దేవిశెట్టి బాబు రావు, మైలవరపు ప్రవీణ్, శనక్కాయల శివ, రామ హైమావతి, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ట్రాఫిక్ నిలిచిపోయింది. కనకదుర్గ వారధిపై భారీలోడ్‌తో వెళుతున్న లారీ టైర్లు పగిలిపోయాయి. మార్చడానికి గంట పట్టడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. ఎండ వేడిమి తట్టుకోలేక పలువురు వాహనాలను వెనక్కు మరలించి వెళ్లిపోయారు. ట్రాఫిక్ పోలీసులు లారీ వద్దకు వెళ్లి టైర్లు మార్చేందుకు సహకరించారు. గంట అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. వాహనాలు పూర్తిగా కదలడానికి మరో గంట పైగా పట్టింది.