
నర్సుల సేవలు వెలకట్టలేనివి
గుంటూరు మెడికల్: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శుశృత హాలులో జరిగిన వేడుకల్లో సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఆసుపత్రిలో నర్సుల సేవలు ఎంతో కీలకమని, రోగులు త్వరితగతిన వ్యాధి నుంచి కోలుకోవడంలో వారి పాత్ర ప్రముఖమని తెలిపారు. ఆసుపత్రికి మూలస్తంభాలుగా నర్సింగ్ సిబ్బంది ఉంటారని, వారి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ఏడాదిలోపు పదవీ విరమణ చేయనున్న హెడ్ నర్సులు రాజవర్ధని, రాజ్యలక్ష్మి, బాలమంజరి, గాయత్రి, శౌరి సంగీత, కృపమ్మలను సంఘం నేతలు సత్కరించారు. వీరితోపాటు గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్లు కిరణ్మయి, గంగమ్మ, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్లు ఆవుల విజయ, రమాదేవి, నాంచారమ్మ, జయలక్ష్మిలను సత్కరించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో నర్సుల సంఘం జిల్లా సెక్రటరీ వెల్లంపల్లి పద్మజ, ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, కోశాధికారి పారాబత్తిన హేమలత, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎం.ఆషాలత, పి.సునీత, పెనుమాక సుధారాణి, భూలక్ష్మి, గోగుల అరుణ పాల్గొన్నారు.