
వైఎస్సార్ సీపీ నాయకుడిపై టీడీపీ నేతల దాడి
వెల్దుర్తి: మండలంలోని బోదిలవీడు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు అత్తులూరి హనుమంతరావుపై అదే గ్రామానికి చెందిన కంకనంపాటి పాపయ్య, మందలపు రాజేష్‌లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. హనుమంతరావు పొలానికి వెళ్లి తిరిగి వచ్చిన సందర్భంలో బస్టాండ్ సెంటర్‌లో టీడీపీ కార్యకర్తలు ఆయనపై రాళ్లు, కర్రలతో దాడి చేయటంతో గాయాలపాలయ్యాడు. బంధువులు హనుమంతరావును మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నర్సరావుపేట వైద్యశాలకు తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు
నూజెండ్ల: పిచ్చికుక్క దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డ సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కమ్మవారిపాలెం యానాది కాలనీలో ఆరుబయట నిద్రిస్తున్న వారిపై రాత్రి 12 గంటల సమయంలో ఓ పిచ్చికుక్క దాడి చేసింది. కాలనీకి చెందిన మల్లవరపు వెంకటేశ్వర్లు, మల్లవరపు అంకమ్మ, చలంచర్ల అప్పారావులను కరిచింది. 108 వాహనంలో బాధితులను నూజెండ్ల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. యాంటీరేబిస్ ఇంజక్షన్ ఇవ్వాల్సిన వైద్యుడు అందుబాటులో లేకపోవటంతో అక్కడి వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి వినుకొండ వైద్యశాలకు తరలించారు.