తెనాలి అర్బన్: తెనాలి పట్టణంలో ఇటీవల నిర్మించిన పలు సీసీ రోడ్ల నాణ్యతను బుధవారం గుంటూరు నుంచి వచ్చిన క్వాలిటీ కంట్రోల్ సభ్యులు పరిశీలించారు. యడ్లలింగయ్య కాలనీలో–6, అమరావతి ప్లాట్స్ స్విమ్మింగ్ పూల్ దగ్గర, పూలే కాలనీ, చెంచుపేట రత్నశ్రీ పబ్లిక్ స్కూల్ దగ్గర, గంగానమ్మపేట శివాలయం వద్ద నిర్మించిన పలు రోడ్లను పరీశీలించి, వాటికి నాణ్యత పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి మున్సిపల్ ఇంజినీర్ ఆకుల శ్రీనివాసరావు, ఏఈలు సూరిబాబు, సునీల్, జానీ బాషా పాల్గొన్నారు.
పవర్ లిఫ్టింగ్ పోటీలలో మదిర షానూన్ సత్తా
మంగళగిరి: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో ఈనెల 6న జరిగిన ఏషియన్ జూనియర్ క్లాసిక్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొన్న మదిర షానూన్ 47 కేజీల విభాగంలో సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయభాస్కరరావు, షేక్ సంధాని తెలిపారు. తెనాలికి చెందిన షానూన్ అక్కడే ఉన్న క్విక్ ఫిట్నెస్ ఎరినాలో అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయి రేవతి వద్ద శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. పతకాలు సాధించిన షానూన్‌ను రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు అభినందించినట్లు తెలియజేశారు.
తెనాలిలో సదరం క్యాంప్ పునఃప్రారంభం
తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాలను పునఃపరిశీలన కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్‌ను నిర్వహించారు. ఆర్థో, ఈఎన్‌టీ, సైక్రాటిక్ విభాగాలకు చెందిన దివ్యాంగులు పరీక్షలు చేయించుకున్నారు. గురు, శుక్రవారాల్లో కూడా క్యాంప్ జరుగుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం
మంగళగిరి టౌన్: స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం భగవత్ ప్రార్థన, ఆచార్య స్తోత్ర పాఠం, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విగ్వరణం, రక్షా బంధనం, మృత్సంగృహణం, అంకురార్పణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైభవంగా బ్రహ్మోత్సవాలు
పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావన్నారాయణ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామికి పంచామృత స్నపన, తిరుమంజనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయ ంత్రం రామలక్ష్మణస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం హనుమద్వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

రోడ్ల నిర్మాణాలు పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ బృందం