
నాలుగు లైన్లరహదారితో మేలు
గుంటూరు వెస్ట్: అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నుంచి నిజాంపట్నం పోర్టు వరకు నూతనంగా నిర్మించనున్న నాలుగు లైనుల (గ్రీన్ ఫీల్డ్) రోడ్డు నిర్మాణంతో ఎందరికో మేలు జరుగుతోందని బాపట్ల ఎంపీ టి.కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ శంకరన్ హాలులో స్టేక్ హోల్డర్స్‌తో నిర్వహించిన సమావేశంలో ఎంపీతోపాటు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్రవర్మ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా పాల్గొన్నారు. ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అమరావతి రింగ్‌రోడ్డు నుంచి నిజాంపట్నం పోర్టు వరకు 47.848 కిలోమీటర్లు నాలుగు లైనుల రోడ్డు నిర్మాణం వల్ల ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రోడ్డు నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చామన్నారు. ఆరు మాసాల్లో నిర్మాణ పనులకు అనుమతులు పొందిన తరువాత మరో 18 నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, బాపట్ల జిల్లా కలెక్టర్ మురళిలు మాట్లాడుతూ ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, ఇరిగేషన్, ఫిషరీస్, వ్యవసాయం, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖ, అటవీ శాఖ అధికారులు వారి వారి శాఖలకు సంబంధించి ఏవైనా అంశాలు ఉంటే పూర్తి వివరాలతో శుక్రవారం సాయంత్రంలోపు అందించాలని పేర్కొన్నారు. అధికారులు అందించిన వివరాలు క్రోడీకరించి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి ఢిల్లీలోని నేషనల్ హైవే అథారిటీ వారికి పంపుతామని వివరించారు. అనంతరం రోడ్డు నిర్మాణానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను నేషనల్ హైవే అథారిటీ అధికారులు వివరించారు. సమావేశంలో ఎన్‌హెచ్ ఏఐ పార్వతీశం, డీఆర్వో షేక్ ఖాజావలి, డీపీఓ నాగసాయికుమార్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ బ్రహ్మయ్య పాల్గొన్నారు.
బాపట్ల ఎంపీ టి.కృష్ణప్రసాద్