
చెరువు భూములపై బడాబాబుల కన్ను
తాడికొండ: తాడికొండ మండలం పాములపాడులో ఎస్సీలకు చెందిన చెరువు భూములు కారుచౌకగా కొట్టేసేందుకు బడా బాబులు రంగంలో దిగారు. రెండో దశలో పూలింగ్ జరుగుతుందనే ఊహాగానాలు వెలువడడంతోపాటు, కొన్ని గ్రామాల్లో నోటిఫికేషన్, గ్రామ సభలు ప్రారంభమైన నేపథ్యంలో కారుచౌకగా భూములు కొట్టేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే పాములపాడులోని చెరువు పోరంబోకు సర్వే నంబరు 132లో 30.50 ఎకరాలపై మంగళవారం ప్రైవేటు సర్వేయర్లతో కొలతలు వేయించి దళితుల భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారు. ఎకరా రూ. 17లక్షల నుంచి రూ. 19 లక్షలు చొప్పున భూములు కొనుగోలు చేస్తాం, డీకే పట్టాలు ఉంటే తమకు అప్పజెప్పడంటూ అభయమిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. విజయవాడకు చెందిన ప్రైవేటు సర్వేయర్ల బృందం కొలతలు వేస్తుండటంతో గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వీఆర్‌ఓ సర్వే నిలుపుదల చేయించారు. విషయంపై ఆరా తీయగా, ఎవరో విజయవాడకు చెందిన వ్యక్తులు కొనుగోలు చేసేందుకు వచ్చారని, తమకు అంతకు మించి ఏమీ తెలియని గ్రామస్తులు చెబుతున్నారు. ఒక్కో రైతు ఖాతాలోకి రూ. 11వేలు చొప్పున బయానా ఇచ్చి ఇప్పటికే భూములు స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
పూలింగ్‌లో లాభపడేందుకే..!
పాములపాడు, వరగాని, రావెల, గ్రామాల్లో సినీ హీరో నందమూరి బాలకృష్ణ, భార్య వసుంధర పేరిట భూములు కొనుగోళ్లు జరిగాయి. వీటితోపాటుగానే ఈ భూములు కూడా లోకేష్, బాలకృష్ణ అనుచరులు కొనుగోలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో చౌడు, బీడు, సాగుకు పనికి రాని భూములను రూ. 25లక్షల నుంచి రూ. 30 లక్షలకు కొనుగోలు చేయగా, ఇప్పుడు ఏకంగా చెరువు భూముల మీద కన్ను పడింది. ఒకే ప్రాంతంలో 30 ఎకరాల భూమి దానికి కొంత పోరంబోకు, కలిపి సుమారు 40 ఎకరాల వరకు భూమి ఉంటుందని, అంచనా. పూలింగ్ ప్రక్రియలో లాభ పడేందుకే బడాబాబులు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజ ధాని పూలింగ్‌లో సైతం లంక, అసైన్డ్ భూములు ఇదే రీతిలో కొనుగోలు చేసి బినామీ పేర్లతో పూలింగ్‌కు ఇచ్చి టీడీపీ మంత్రులు, అనుయాయులు భారీగా లబ్ధి పొందారు. ఇప్పుడు రెండో దశ పూలింగ్ అని, ఊహాగానాలు ప్రారంభం కావడంతో మళ్లీ పేదల భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది.
పాములపాడులో ఎస్సీలకు చెందిన చెరువు భూముల్లో ప్రైవేటు సర్వే
లోకేష్, బాలకృష్ణలు కొనుగోలు
చేస్తున్నారంటూ ప్రచారం!
రెండో దశ పూలింగ్‌లో లాభ పడేందుకే అంటున్న గ్రామస్తులు