
పోరుబాటలో ఉపాధ్యాయులు
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏపీటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. సంఘ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు బ్రాడీపేటలోని పశ్చిమ తహసీల్దార్ కేంద్రం వద్ద సోమవారం గుంటూరు జోన్ కన్వీనర్ పి.నాగశివన్నారాయణ అధ్యక్షతన ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు మాట్లాడుతూ 117 జీవో అమలుకు పూర్వ స్థితిలో ఉన్న పాఠశాల విద్యారంగాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలల నుంచి 3,4,5 తరగతులు వెనక్కి తీసుకువస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకపోగా, అదనంగా 1,2 తరగతులను సైతం కలపడం తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మోసగించడమేనని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో విద్యాశాఖామంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఒకటి నుంచి ఐదు తరగతుల్ని ప్రాథమిక పాఠశాలలోను, 6 నుంచి 10 లేక 12 తరగతులు ఉన్నత పాఠశాలల్లో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో 44 మంది విద్యార్థులు మించితే రెండవ సెక్షన్ ఇవ్వాలని కోరారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలకు గ్రేడ్–2 హెచ్‌ఎం, పీఈటీ పోస్టును ఇచ్చి, పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయాలన్నారు. అసంబద్ధ నిర్ణయాలను కొనసాగిస్తే ఈనెల 9వ తేదీ అన్ని జిల్లా కలెకరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే ఈనెల 14వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున మహా ధర్నా చేపడతామని హెచ్చరించారు. గుంటూరుతో పాటు, పొన్నూరు, తెనాలి, మంగళగిరిలో నిరసన ప్రదర్శనలు విజయవంతంగా జరిగాయని తెలిపారు. ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, కరువు భత్యం 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలు ప్రకటించి, మొత్తం బకాయిలను విడుదల చేయాలని కోరారు. అనంతరం డెప్యూటీ తహసీల్దార్‌కు మెమోరాండం సమర్పించారు. నిరసన ప్రదర్శనలో ఎం.ఎన్. మూర్తి, ఎస్.ఎస్.ఎన్. మూర్తి, లక్ష్మీనారాయణ, కె.రమేష్, దాస్, రమాదేవి, వెంకటేశ్వర్లు, జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, కిశోర్ షా భారతి, విజయశ్రీ, భాస్కర్, కుటుంబరావు, బాలరాజు, సుబ్బారావు, జహంగీర్ పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం