తెనాలి: స్థానిక కొత్తపేటలోని కాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీలోని డీఎల్ కాంతారావు కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఆలిండియా పోస్టల్, ఆర్‌ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ 2వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎం.ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్‌సీసీపీఏ సెక్రటరీ జనరల్ కె.రాఘవేంద్రన్ మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘాన్ని పటిష్టం చేసి, ఐక్యంగా పోరాడాలని సూచించారు. వైద్యసదుపాయాల అంశంలో ఉన్న సమస్యలపై పోరాడాల్సి ఉందన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్ ఆవశ్యకతను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పు కాపీలను రాష్ట్ర నలుమూలల్నుంచి వచ్చిన కార్యకవర్గసభ్యులు రాష్ట్ర కార్యదర్శి నిమ్మగడ్డ నాగేశ్వరరావుకు అందజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని గౌరవాధ్యక్షుడు డీఎల్ కాంతారావు హామీనిచ్చారు. ఎఫ్‌ఎన్‌పీఓ సెక్రటరీ జనరల్ శివాజీ మాట్లాడుతూ సర్వీసు ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను వివరించారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని చెప్పారు. ఏఐపీఈయూ పోస్ట్‌మెన్, గ్రూప్–డి సర్కిల్ కార్యదర్శి సీహెచ్ విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, వ్యతిరేక విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు. పెన్షనర్లు, ఉద్యోగులు ఐక్యపోరాటాలను జరపాల్సిన ఆవశ్యకతను వివరించారు. సభలో ఆయా సంఘాల నేతలు ఎన్.రామారావు, కేఎస్‌సీ బోసు, న్యాయవాధి బి.జయభారతరెడ్డి, అతిథులు డి.మోహనరావు, కె.రాజారావు, పి.బాబూజీ, సీహెచ్ కోటేశ్వరరావు, వివిధ డివిజన్ల కార్యదర్శులు ప్రసంగించారు. తొలుత ఏఐపీఆర్‌పీఏ జెండాను డీఎల్ కాంతారావు, ఎన్‌సీసీపీఏ జెండాలను కె.రాఘవేంద్రన్ ఆవిష్కరించారు.
రాష్ట్ర కమిటీ 2వ సర్వసభ్య సమావేశంలో ఎన్‌సీసీపీఏ సెక్రటరీ జనరల్ కె.రాఘవేంద్రన్