నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం కౌన్సిల్ అత్యవసర సమావేశం తాత్కాలిక మేయర్ షేక్ సజిల అధ్యక్షతన జరగనుంది. ఇటీవల నగర మేయర్‌గా కావటి శివనాగమనోహర్‌నాయుడు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమోద తీర్మానం చేసేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
మత్స్యకారుల
సంక్షేమమే ధ్యేయం
జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు
విజయపురిసౌత్: మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు అన్నారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాలతో మాచర్ల మండలం అనుపు వద్ద కృష్ణా జలాశయంలోకి 10 లక్షల చేప పిల్లలను సోమవారం విడుదల చేశారు. అనంతరం సంజీవరావు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత వారంలో సైతం 10 లక్షల చేప పిల్లలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అలి వలలతో చేపల వేట చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మత్స్య సంపదను కాపాడుకోవాలని సూచించారు. ఎఫ్‌డీఓ టీవీఏ శ్రీనివాసరావు, అగ్రికల్చర్ ఏఓ జగదీష్, మత్స్యశాఖ తనిఖీ అధికారి వెంకట రమణ, గ్రామ మత్స్య సహాయకులు లీలావతి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
యార్డుకు 1,18,783 బస్తాలు మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,18,783 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,05,617 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,200 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,200 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 64,366 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.