మంగళగిరి టౌన్: 1998 డీఎస్సీలో మిగిలిన బీసీ, ఎస్సీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళగిరి ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1998 డీఎస్సీలో ఓసీలకు 50 మార్కులు, బీసీలకు 45, ఎస్సీలకు 40 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని, కానీ ఆయా కేటగిరీల్లో తగినంత మంది అభ్యర్థులు అర్హత సాధించకపోవడంతో 5 మార్కులు తగ్గించి ఇంటర్వ్యూలకు పిలిచారన్నారు. గత ఎన్నికల్లో యువగళం పాదయాత్రలో తమ సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లామని, తాము అధికారంలోకి వస్తే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి 8 జిల్లాలకు సంబంధించి నష్టపోయిన డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు వరప్రసాద్, 98 డీఎస్సీ రిమైనింగ్ క్యాండిడేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సుహాసిని, జగ్గయ్య, శ్రీనివాసులు, మీరావలి, చంద్రయ్య, గోవిందరావు, మధుసూదన్‌రావు, జయరామయ్య, కె.జె.ఎస్. కుమార్ పాల్గొన్నారు.
9న వివాహం.. ఇంతలోనే విషాదం
పెదకాకాని: వివాహమై 13 రోజులు కూడా కాకముందే గుండెనొప్పితో ఓ డాక్టర్ మరణించడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఆ నవ వధువు భర్తను కోల్పోయి తీవ్ర దుఖః సాగరంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడేళ్లుగా డాక్టర్ శివాచారి (33) విధులు నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందారు. ఈనెల 9వ తేదీన శివాచారికి వైద్యురాలైన లావణ్యతో తిరుపతిలో వివాహం జరిగింది. అయితే ఆయనకు శుక్రవారం తెల్లవారుజామున గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి సర్జరీ చేయించారు. చికిత్స పొందుతున్న శివాచారి అదేరోజు రాత్రి మరణించాడు. మృతదేహాన్ని ఒంగోలులోని స్వగృహానికి తరలించారు. వైద్యుడి మృతదేహాన్ని పలువురు డాక్టర్లు, సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు. గ్రామ మాజీ సర్పంచి కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, పలువురు గ్రామ పెద్దలు వైద్యుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాడ సానుభూతి తెలిపారు.