నగరంపాలెం: జిల్లాలోని మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసం శక్తి యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. శక్తి బృందాలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శక్తి యాప్ సేవలను జిల్లాలోని మహిళలు, చిన్నారులకు అందించేందుకు ఎస్‌ఐ స్థాయి అధికారితో ఒక్కో బృందంలో ఆరుగురు పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉంటారని అన్నారు. ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో పోలీస్ సబ్ డివిజన్‌కు ఒక్కో బృందం చొప్పున ఆరు బృందాలను నియమించామన్నారు. మిగతా రెండు బృందాలు మహిళా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంటాయన్నారు. ఈ బృందాలకు మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ సుబ్బారావు, సీఐ నారాయణ దిశా నిర్దేశం చేస్తారన్నారు. శక్తి పోలీస్ బృందాలు నిరంతరం పాఠశాలలు, కళాశాలలు వద్ద గస్తీ నిర్వహిస్తాయని పేర్కొన్నారు. శక్తి యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని వ్యక్తిగత సమాచారం నింపి, సేవలను పొందవచ్చునని ఎస్పీ సూచించారు. జిల్లా ఏఆర్ ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీలు సుబ్బారావు, అబ్దుల్ అజీజ్, కె.అరవింద్, ఎ.భానోదయ, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
జెండా ఊపి సేవలు
ప్రారంభించిన జిల్లా ఎస్పీ