గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లాస్థాయి న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్‌లో గుంటూరు చంద్రశేఖర్–9 జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు గురువారం సాయంత్రం ఒకటో అదనపు జిల్లా జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి, నాలుగో అదనపు జిల్లా జడ్జి రుద్రపాటి శరత్ బాబు ట్రోఫీలను బహూకరించారు. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుంటూరు న్యాయవాదుల జట్టుతో నరసరావుపేట న్యాయవాదుల జట్టు తలపడింది. తొలుత టాస్ గెలిచిన నరసరావుపేట జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన గుంటూరు న్యాయవాదుల జట్టుకు ఓపెనర్లు అంచుల రామాంజనేయులు (47 బంతుల్లో 59 పరుగులు), మహమ్మద్ మాజ్ (27 బంతుల్లో 48 పరుగులు) నిలకడైన ఆటతీరుతో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన జట్టు కెప్టెన్ చంద్ర శేఖర్ రెడ్డి (26 బంతుల్లో 65 పరుగులు), సాజిద్ (20 బంతుల్లో 30 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో గుంటూరు న్యాయవాదుల జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లకు 221 పరుగులు చేసింది. నరసరావుపేట జట్టులోని ఖాదర్, కిరణ్, సూర్యలకు ఒక్కో వికెట్ లభించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నరసరావుపేట జట్టు 17.3 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో పది ఓవర్లకు 110/1 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న నరసరావుపేట జట్టును గుంటూరు జట్టు బౌలర్ సాజిద్ కుప్పకూల్చాడు. సాజిద్ 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు కూల్చాడు. నరసరావుపేట జట్టులో అధికంగా యశ్వంత్ 20 పరుగులు, రవి 44 పరుగులు, మధు 32 పరుగులు చేశారు. బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసి బ్యాటింగ్లో 30 పరుగులు సాధించిన గుంటూరు న్యాయవాదుల జట్టు ప్లేయర్ సాజిద్‌కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. నాలుగు రోజులుగా గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో బాపట్ల, వినుకొండ, సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరుల నుంచి మొత్తం ఎనిమిది న్యాయవాదుల జట్లు పాల్గొన్నాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లలో బాపట్ల జట్టుతో పోటీపడి నరసరావుపేట జట్టు విజయం సాధించగా, వినుకొండ జట్టుతో పోటీపడిన గుంటూరు జట్టు విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య గురువారం ఫైనల్ జరిగింది.