అద్దంకి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రసన్నాంజనేయ స్వామి 70వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం రాత్రి శింగరకొండ భక్తజన సంద్రంగా మారింది. ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయ రాజగోపురాలు, పరిసరాల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ సెట్టింగులతో క్షేత్రం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయింది. విద్యుత్ ప్రభపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, భక్తుల రద్దీతో క్షేత్ర పరిసరాలు ఇరుకుగా మారాయి.
650 మంది పోలీసు బలగాలతో పర్యవేక్షణ
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నలుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 46 మంది ఎస్సైలు, 587 పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. తిరునాళ్ల ఇన్‌చార్జిగా చీరాల డీఎస్పీ మెయిన్ వ్యవహరించారు. సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు, మేదరమెట్ల పైలాన్ వద్ద, రేణింగవరం జాతీయ రహదారి నుంచి అద్దంకి వైపు భారీ వాహనాలను దారి మళ్లించారు. 99 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ సమీపంలో 10 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.