రాష్ట్ర మంత్రి నారా లోకేష్
మంగళగిరి: మంగళగిరిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం యర్రబాలెంలో ఆధునికీకరించిన శ్రీ భగవాన్ మహవీర్ గోశాలను, కొత్త భవన సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ నిడమర్రు రైల్వే గేటు వంతెన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 16 నెలల్లోపు పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ దుగ్గిరాల కోల్డ్‌స్టోరేజీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన రైతులకు మరో రెండు వారాలలో పరిహారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్య, టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, ఆకుల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఒంటిపూట బడులు
డీఈఓ సీవీ రేణుక
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శనివారం నుంచి విద్యార్థులకు ఒక్కపూట తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్యాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే పని చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. టెన్త్ పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా, గ్రామ పంచాయతీ, వైద్యారోగ్య శాఖ సహకారంతో ఓఆర్‌ఎస్ ప్యాట్లను పాఠశాలల్లో అందుబాటు ఉంచుకోవాలని, బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనంలో సేవా సంస్థలు, స్థానికుల సహకారంతో మజ్జిగ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
విజయకీలాద్రిపై
ఫాల్గుణ పౌర్ణమి వేడుక
తాడేపల్లిరూరల్: సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో ఫాల్గుణ మాసం పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళశాసనాలతో ఉదయం 9 గంటలకు లక్ష్మి అమ్మవారికి అభిషేకం, అనంతరం 9.30 గంటలకు లక్ష్మి హయగ్రీవ హోమం అత్యంత వైభవంగా నిర్వహించామని, భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారని తెలియజేశారు.
కానిస్టేబుల్‌పై కేసు నమోదు
చీరాల: వివాహేతర సంబంధం పెట్టుకుని ఘర్షణకు దిగిన కానిస్టేబుల్‌పై వివాహితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చీరాల డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాలకృష్ణ కొంతకాలంగా పేరాలకు చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహిత బంధువులు ఈ విషయాన్ని ప్రశ్నించి ఘర్షణకు దిగారు. ఇరువర్గాలు ఘర్షణ పడడంతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.