● హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ● విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి ● సందేహాల నివృత్తికి ప్రత్యేక కంట్రోల్ రూం నంబర్లు ● జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక
గుంటూరు ఎడ్యుకేషన్ : ఈనెల 17 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక చెప్పారు. కలెక్టరేట్ వద్ద ఉన్న డీఈవో కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 470 పాఠశాలల నుంచి 29,459 మంది రెగ్యులర్ విద్యార్థులతో గతంలో తప్పిన, ప్రైవేటుగా రాస్తున్న మరో 961 మందిని కలుపుకుని మొత్తం 30,410 మంది విద్యార్థుల కోసం 150 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరగనున్న దూరవిద్య టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న 1,133 మంది అభ్యర్థుల కోసం టెన్త్ రెగ్యులర్ పరీక్ష కేంద్రాల్లోనే 21 కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనుండగా, విద్యార్థులు గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు వెళ్లి, వచ్చేందుకు వీలుగా హాల్ టిక్కెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించినట్లు చెప్పారు. పేపర్ లీకేజీకి ఆస్కారం లేని విధంగా ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. విద్యార్థులకు బార్ కోడింగ్ నంబరు కలిగిన ఓఎంఆర్ షీట్‌తోపాటు ప్రశ్నపత్రంపై ప్రత్యేక సీరియల్ నంబరు ఉంటుందని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల కోసం డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామని, 99513 97109, 90523 43447 నంబర్లకు విద్యార్థులు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. టెన్త్ పరీక్షల జిల్లా పరిశీలకురాలు పి.పార్వతి మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల వెలుపల హాల్ టికెట్‌పై ఉన్న సెంటర్ కోడ్‌తో పరీక్ష కేంద్రం పేరును స్పష్టంగా తెలిసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ కె. వెంకట్‌రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి ఏ. తిరుమలేష్, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం పాల్గొన్నారు.