● 14 ఏళ్లకే గుండె పరీక్షలు చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ బుడతడు ● ఏఐ ద్వారా ప్రత్యేక యాప్‌కు రూపకల్పన ● గుంటూరు జీజీహెచ్‌లో పరీక్షలు చేసి అబ్బురపరుస్తున్న సిద్ధార్థ
గుంటూరు మెడికల్: నిమిషంలో గుండె పనితీరు ఎలా ఉందో గుర్తించి లోగుట్టు విప్పేస్తున్నాడు 14ఏళ్ల ఈ ఎన్‌ఆర్‌ఐ బుడతడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. గుంటూరు జీజీహెచ్‌కు ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా అమెరికా నుంచి వచ్చిన ఈ చిన్నోడు రోగులను పరీక్షిస్తున్నాడు. అమెరికాలో స్థిరపడిన ఏపీలోని అనంతపురానికి చెందిన నంద్యాల మహేష్, శ్రీలత దంపతుల తనయుడు సిద్ధార్థ 14 ఏళ్లకే కృత్రిమ మేధస్సుతో అమెరికా డల్లాస్‌లోని టెక్సాస్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ అభ్యసిస్తున్నాడు. గుండె పనితీరును తెలుసుకునేందుకు ప్రత్యేకంగా యాప్‌ను కనిపెట్టాడు. అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, బైడెన్, పలువురి గవర్నర్ల నుంచి అవార్డులు, సన్మానాలు అందుకున్నాడు. అమెరికాలో ప్రయోగాత్మకంగా యాప్ పనితీరు నిరూపించి భారత దేశంలోనూ పేద రోగులకు గుండె పరీక్షలు చేసేందుకు ముందుకు వచ్చాడు. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సహాయంతో అమెరికాలో ఉంటున్న సిద్ధార్థ తల్లిదండ్రులు అతడిని మంగళవారం గుంటూరు జీజీహెచ్‌కు పంపించారు. వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు గుంటూరు జీజీహెచ్‌లో పేద రోగులకు పరీక్షలు చేసేందుకు సిద్ధార్థకు అనుమతిచ్చారు. బుధవారం ఉదయం అతను సుమారు 150 మందికి గుండె పరీక్షలు చేశాడు. సెల్ ఫోన్‌ను ఛాతి దగ్గర నిమిషంపాటు ఉంచితే క్షణాల్లోనే ప్రత్యేక యాప్ ద్వారా ఈసీజీ నివేదిక ప్రత్యక్షమవుతోంది. సిద్ధార్థ తాను పరీక్షించిన వారిలో ఇద్దరికి గుండె పనితీరు సరిగా లేదని గుర్తించాడు. వారిని తక్షణమే వైద్యులు గుండె జబ్బుల వార్డుకు రిఫర్ చేశారు. పరీక్షల తీరును పర్యవేక్షించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ సిద్ధార్థను అభినందించారు.
నిమిషంలో గుండె గుట్టు విప్పేస్తాడు