గుంటూరు మెడికల్: రాష్ట్రంలోనే తొలిసారిగా మినిమల్లి ఇన్విజివ్ (చిన్న గాటుతో) యూని పోర్టల్ వాట్స్ విధానంలో గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్లో రెండు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్టు డాక్టర్ ఖాజా అబ్దుల్ మొయిన్‌బేగ్ తెలిపారు. కిమ్స్ శిఖర హాస్పటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. బీపీ, షుగర్ ఉన్న గుంటూరుకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ అత్యవసరస్థితిలో మూడు రోజుల క్రితం కిమ్స్ శిఖర ఆస్పత్రిలో చేరారు. చీఫ్ కన్సల్టెంట్ థొరాసిక్, మినిమల్ యాక్సిస్ సర్జన్ డాక్టర్ ఖాజా అబ్దుల్ మొయిన్ బేగ్ నేతృత్వంలో వెంటనే రోగిని పరీక్షించగా కుడివైపు ఊపిరితిత్తిలో గాలిబుడగ ఏర్పడి అది పగిలిపోయి లంగ్ పూర్తిగా కుంచించుకుపోయినట్లు గుర్తించారు. యూని పోర్టల్ వాట్స్ విధానంలో చిన్న గాటుతో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అలాగే విజయవాడకు చెందిన 38 ఏళ్ల గృహిణి తరచూ లంగ్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ హాస్పిటల్లో చేరారు. ఆమె లంగ్ ఎడమవైపు కింది భాగంలో నీటి గడ్డ లాంటిది ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. ఈమెకు కూడా యూని పోర్టల్ వాట్స్ విధానంలో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మూడు రోజుల్లోనే రోగులిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పటల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ చిట్టెం లక్ష్మణరావు మాట్లాడుతూ ఊపిరితిత్తుల సమస్యలకు తమ వైద్యశాలలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. అరుదైన శస్త్రచికిత్సలు చేసిన వైద్యులను కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అద్విక్ బొల్లినేని, కిమ్స్ శిఖర హాస్పిటల్ సీఈఓ సుధాకర్ జాదవులు అభినందించారు.