పెదకాకాని : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం నిర్వహించిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష పత్రం లీకై న ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు తెలుస్తోంది. సీడీ ద్వారా ఆన్‌లైన్‌లో అరగంట ముందుగా ప్రశ్నపత్రాన్ని రిలీజ్ చేశామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ మొబైల్ ద్వారా అరగంట ముందే లీకై బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణకు సబంధించిన కొందరు అధికారులు పరీక్ష కేంద్రాల నిర్వాహకుల వ్యవహర శైలిపై ఉదాసీనంగా ఉండడమే లీకేజీకి కారణంగా తెలుస్తోంది. దీంతోపాటు కొత్తగా పరీక్షకు అరగంట ముందుగా సీడీ ద్వారా విడుదల చేసే విధానం కూడా ప్రశ్నపత్రం సులభంగా లీక్ కావడానికి కారణమని పలువురు పేర్కొంటున్నారు. శుక్రవారం పరీక్ష పేపర్ లీక్ అయిందని ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ గురువారం కూడా ప్రశ్నపత్రం అరగంట ముందుగానే లీక్ అయిందన్న విమర్శలు ఉన్నాయి. సంబంధిత అధికారులకు తెలిసినా బయటకు రానియకుండా చూడటం వల్లే పరిస్థితులు శ్రుతి మించుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బీఈడీ పరీక్షలకు సబంధించిన పరీక్ష కేంద్రాల ఖరారు, పరీక్షలను పర్యవేక్షించే అధికారుల నియామకం వంటి కీలక అంశాలు కొన్ని పరీక్షా కేంద్రాల నిర్వాహకుల కనుసన్నల్లో జరుగుతుండటం ఇలాంటి ఘటనలకు కారణమవుతోందనే విమర్శలూ వస్తున్నాయి. ప్రశ్నపత్రం లీకేజీపై ఉన్నత విద్యాశాఖామంత్రి లోకేష్ విచారణకు ఆదేశించారు.
పరీక్షకు అరగంట ముందే లీకై న మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రం పరీక్షల నిర్వహణలో ఏఎన్‌యూ అధికారులు నిర్లక్ష్యం