
చిన్నారులకు మందు వేస్తున్న ఆరోగ్య కార్యకర్త
ఎంతో ప్రయోజనం
పల్నాడు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకూ మెడికల్ కిట్లను పంపిణీ చేశాం. గతంలో కంటే ఈసారి వచ్చిన కిట్లలో ఎక్కువ మందులు ఉన్నాయి. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పిల్లలకు జ్వరం, చిన్నపాటి గాయాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తితే ఈ కిట్టులోని మందులు ఎంతగానో ఉపయోగపడతాయి. పిల్లల్లో సాధారణంగా వచ్చే చర్మ వ్యాధుల నిర్మూలనకు సంబంధించిన ఆయింట్‌మెంట్లు ఇందులో ఉన్నాయి.
– బి.అరుణ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్,
పల్నాడు జిల్లా
పిల్లల ఆరోగ్య పరిరక్షణకు..
ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు ప్రతి 3,4 రోజులకొకసారి అంగన్‌వాడీ కేంద్రాల్ని పర్యవేక్షిస్తారు. కేంద్రంలోని పిల్లల పెరుగుదల, ఎత్తు, బరువు పరీక్షల నిర్వహణతోపాటు కిట్లలోని మందుల్ని అవసరమైన వారికి అందిస్తారు. ఫస్ట్ ఎయిడ్ కిట్‌లోని మందులపై అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తారు.
– ఎం.జోజమ్మ, సూపర్‌వైజర్,
ఐసీడీఎస్ సొలస సెక్టార్
యడ్లపాడు: అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు సమకూర్చింది. మనబడి నాడు–నేడు ద్వారా పాత భవనాలు ఆధునికీకరించింది. ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న కేంద్రాలకు అద్దెను పెంచింది. కేంద్రాల నిర్వహణ, చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తోంది. చిన్నారులకు ఇంగ్లిష్‌లో బోధనకు శ్రీకారం చుట్టింది. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ప్రతినెలా మొదటి, మూడో శుక్రవారాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను వైద్యులు సందర్శించేలా ఆదేశాలిచ్చింది. గర్భిణులు, బాలింతలకు టేక్ హోం రేషన్ విధానం అమలు చేసింది. నాణ్యతలో రాజీ లేకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్‌ఓపీ) కచ్చితత్వం పాటించేలా చర్యలు చేపట్టింది. క్వాలిటీ సర్టిఫికేషన్ తప్పనిసరి చేసింది. అంగన్‌వాడీల్లో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు 19 రకాల ఆట వస్తువులతో కిట్లను అందించింది. పిల్లల ఎదుగుదలకు స్టడీ, ఇన్‌ఫాంటో మీటర్లు, సాల్టర్ స్కేల్, బరువు తూచే యంత్రాలను సమకూర్చింది.
అత్యవసర కిట్ల పంపిణీ
తాజాగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రా ల్లోని చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అత్యవసర ప్రాథమిక చికిత్స(ఫస్ట్ ఎయిడ్) కిట్లను పంపిణీ చేసింది. ఈ కిట్లలో పారాసిటమాల్ సిరప్, ఐరన్ టాబ్లెట్లు, అయోడిన్, సిల్వర్ సల్ఫాడైజీన్, క్లోరో ఫినరామిన్ మాలియట్, ఫురాజోలిడిన్, హ్యాండ్ శానిటైజర్, రోలర్ బ్యాండేజ్, నియోమైసిన్ ఆయింట్‌మెంట్, కాటన్, సిప్రోఫ్లాక్సిన్ చుక్కల మందు, బెంజయిల్, బెంజోయేట్, మరికొన్ని సిరప్‌లు ఉన్నాయి. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం పేరిటా పిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు, ఏయే మందులను ఎంతెంత మోతాదులో ఎలా వినియోగించాలో పేర్కొంటూ తెలుగులో సమాచారాన్ని కూడా పంపించారు. ఆయా మందుల వినియోగంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు వైద్యసిబ్బందిచే అవగాహన కల్పించారు.
పల్నాడు జిల్లాలో ఇలా..
ఐసీడీఎస్ ప్రాజెక్టులు 9
అంగన్‌వాడీ కేంద్రాలు 2,010
మినీ కేంద్రాలు 10
గర్భిణులు 11,782
బాలింతలు 12,534
6నెలల్లోపు చిన్నారులు 12,612
6 నుంచి ఏడాదిలోపు పిల్లలు 12,583
ఏడాది నుంచి మూడేళ్ల పిల్లలు 51,771
3 నుంచి 6 ఏళ్ల మధ్య పిల్లలు 48,273
బిడ్డకు భరోసా.. తల్లికి రక్షణ
అంగన్‌వాడీ కేంద్రాలకు ఔషధ కిట్లు
జిల్లాలోని 2,031 కేంద్రాలకు సరఫరా
ఒక్కో ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో 10 రకాల మందులు
జిల్లాలో 1,25,239 మంది చిన్నారులకు ప్రయోజనం
24,316 మంది గర్భిణులు, బాలింతలకూ ఉపయోగమే
పిల్లల ఆరోగ్యంపై ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తల పర్యవేక్షణ

అంగన్‌వాడీ కార్యకర్తలకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందిస్తున్న దృశ్యం

