
పుప్పాల గిరి (ఫైల్)
మంగళగిరి: తోటి స్నేహితులతో కలసి బహిర్భూకి వెళ్లిన ఆరో తరగతి విద్యార్థి చెరువులో జారిపడి మృతి చెందిన సంఘటన నవులూరు ఎంఎస్‌ఎస్ కాలనీలో చోటుచేసుకుంది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఎంఎస్‌ఎస్ కాలనీకి చెందిన పుప్పాల బాజి, కోటేశ్వరి దంపతుల కుమారుడు గిరి (12) అదే కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కుమార్తె హర్షిత పదో తరగతి చదువుతోంది. శనివారం ఉదయం గిరి తన స్నేహితులతో కలసి బహిర్భూమికి వెళ్లాడు. పక్కనే ఉన్న గంగానమ్మ చెరువులో జారిపడిపోయి మునిగిపోయాడు. తోటి స్నేహితులు భయాందోళనతో పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటీన సంఘటనా ప్రాంతానికి చేరుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు గిరి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.