తెనాలి రూరల్: తెనాలి పాండురంగపేటకు చెందిన రౌడీషీటర్ మత్తే ప్రశాంత్(30) హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముఖాలకు మాస్కులు వేసుకుని హత్య చేసిన నిందితుల ఆచూకిని అతికష్టం మీద గుర్తించి శ్రీశైలంలో గురువారం రాత్రి పొద్దుపోయాక అదపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం హత్యకు పాల్పడగా, పోలీసులు నిందితుల వివరాలు రాత్రికి సేకరించగలిగారు. వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకున్నారు. పాండురంగపేటకే చెందిన నిందితులు, వారి కుటుంబ సభ్యులపై ప్రశాంత్, అతడి తల్లి గతంలో కేసు పెట్టినట్లు చెబుతున్నారు. మృతుడి తల్లిపై నిందితుల కుటుంబ సభ్యులు దాడి చేశారని కేసు సారాంశం. రెండు కుటుంబాలు సమీప ఇళ్లలోనే నివసిస్తుంటాయి. మహిళలు కోర్టు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారని, రాజీకి రావాలని పలుమార్లు ప్రశాంత్‌ను కోరినా రాజీకి రాకపోవడంతోనే హత్యకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.