
నిందితుడితో ఎస్‌ఐ ఆనంద్, కానిస్టేబుల్ జరీనా, పక్కన రైతు గోపి
పట్నంబజారు: రైతు వద్ద నుంచి నగదు సంచి లాక్కుని ఉడాయిస్తున్న దుండగులను అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసు ధైర్యంగా వెంటబడి పట్టుకున్న సంఘటన గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ అవుట్‌పోస్ట్ పోలీసులు, బాధిత రైతు గోపి కథనం ప్రకారం.. గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం కనగాల గ్రామానికి చెందిన సద్యపోగు గోపి మిర్చిరైతు. పంటను గుంటూరు మిర్చియార్డుకు తీసుకునివచ్చి విక్రయించిన తరువాత ఆ సొమ్మును తీసుకుని తిరుగు పయనమయ్యాడు. ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని ఫ్లాట్‌ఫారం 8 వద్ద కర్నూలు బస్సు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణికుల్లా వచ్చి రైతు గోపికి వెనక ముందు నిలబడ్డారు. ఒక్కసారిగా రైతు చేతిలోని రూ 6.48 లక్షలు ఉన్న బ్యాగును తీసుకుని ఉడాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైతు గోపి కేకలు వేయటంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్ షేక్ జరీనా స్పందించి నిందితుల వెంట పడ్డారు. ఎట్టకేలకు వారిని పట్టుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించటంతో పాటు రైతుకు నగదు బ్యాగును అందజేసింది.
జరీనాకు అభినందనలు..
కానిస్టేబుల్ జరీనా తెగువకు ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది అభినందనలు తెలిపారు. నిందితులను పట్టుకోవటంతో పాటు పాతగుంటూరు పోలీసులకు అప్పజెప్పారు. నిందితుల్లో పచ్చేటి ధర్మ దొరకగా, మరో ఇద్దరు పరారయ్యారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.