సర్కారీ బడుల్లోనూ నాణ్యత సాధ్యమే!

YS Jagan Mohan Reddy Government Spend More For Govt Schools - Sakshi

విద్యారంగం వ్యాపారంగా మారి దాదాపు మూడు దశాబ్దాలు దాటింది. ప్రభుత్వాలు కూడా ప్రైవేట్‌ విద్యారంగాన్నే ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను క్రమంగా నిర్వీర్యం చేశాయి. ప్రైవేట్‌ విద్యా సంస్థలు మొదట్లో విశాలమైన స్థలంలో హంగు ఆర్భాటాలతో విద్యార్థులను ఆకర్షించి నాణ్యమైన విద్యను అందించడం వాస్తవం. కానీ, ఎప్పుడైతే విద్యాసంస్థల యజమానులు రాజకీయనాయకుల ప్రాపకం కోసం పార్టీలకు మహారాజ పోషకులుగా తయారయ్యారో అప్పటి నుంచి విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం మొదలైంది. (చదవండి: విశాఖపై ఇంత దుష్ప్రచారమా?)

కార్పొరేట్‌ విద్యాసంస్థల దగ్గర లంచాలు తీసుకోవడం అలవాటు చేసుకున్న ప్రభుత్వాలు, పార్టీలు ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరచడం ప్రారంభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే చదువు రాదనే దురభిప్రాయం స్లో పాయి జన్‌లా తల్లితండ్రుల మెదళ్లలో జొప్పించడంలో ప్రభుత్వాలు, కార్పొరేట్‌ యాజమాన్యాలు సఫలం అయ్యాయి. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రముఖ కార్పొరేట్‌ కళాశాలల యజమానులు వారికి ఆర్థికంగా అండగా నిలబడ్డారంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యా రంగంలో వ్యాపించిన జాడ్యాన్ని తొలగించడానికి భారీగా నిధులను వెచ్చించింది. సుమారు 36 వేలకోట్ల రూపాయలు ఖర్చుచేసి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కలుగజేసింది. మినరల్‌ వాటర్, ఆహ్లాదకరమైన రంగులు,  ఖరీదైన ఫర్నిచర్, ఏసీలు, ఫాన్లు, శౌచాలయాలు, అన్నింటినీ మించి నాణ్యమైన మెనూతో భోజనం, పచ్చదనం మొదలైన సదుపాయాలు సమకూర్చింది. గత రెండేళ్లలో సుమారు 6 లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మళ్ళారు. ఇది నిజంగా హర్షణీయం.


ఇక్కడే కొందరు రంధ్రాన్వేషకులు బయలు దేరారు. మౌలిక వసతులు కల్పిస్తున్నారు సరే, నాణ్యమైన విద్య ఎలా ఇస్తారు అంటూ నిలదీస్తున్నారు. కార్పొరేట్‌ రంగంలో నాణ్యమైన విద్య దొరుకుతుందని, ప్రభుత్వ రంగంలో లేదని వీరి అభిప్రాయం అన్నమాట! ప్రభుత్వరంగంలో ఉపాధ్యాయులను నియమించేటపుడు వారికి అనేక కఠిన పరీక్షలు పెడతారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో అలా జరగదు.  ఎవరు తక్కువ వేతనానికి పనిచేస్తామంటే వారిని నియమించుకుంటారు. విద్యార్హతలు కూడా కార్పొరేట్‌ రంగ ఉపాధ్యాయుల కన్నా ప్రభుత్వరంగ ఉపాధ్యాయులకే అధికంగా ఉంటాయి. ప్రభుత్వ కాలేజీలో డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ కావాలంటే కచ్చితంగా డాక్టరేట్‌ చేసి ఉండాలి. ప్రభుత్వ బోధన సిబ్బందిని తక్కువ అంచనా వెయ్యడం అజ్ఞానం కారణంగానే!  (చదవండి: అమెరికాకు తగ్గుతున్న భారత విద్యార్థులు.. ఎందుకంటే?)

కార్పొరేట్‌ రంగం వైపు తల్లితండ్రులు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అని ప్రశ్నించుకుంటే అక్కడ లభిస్తున్న మౌలిక సదుపాయాలు, రంగుల హంగులు, ఆటస్థలాలు, పరికరాలు, రవాణా వసతి. అవే వసతులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా కల్పించగలిగితే విద్యార్థులను తప్పకుండా ఆకర్షించవచ్చు. నాణ్యమైన విద్యకు కొరత ఏమీ లేదు. కాకపొతే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ రంగ ఉపాధ్యాయులకు కూడా శిక్షణనివ్వడం అవసరం. ప్రభుత్వ విద్యారంగం మీద కూడా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. కలెక్టర్లు, జిల్లా విద్యాధి కారులు విద్యాసంస్థల మీద కన్నువేసి ఉపాధ్యాయుల గైర్హాజరీలు, ఇతర వ్యాపారాల లాంటి వాటిమీద కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వ రంగంలో ఉత్తమ ఫలితాలు రాబడితే రాబోయే పదేళ్లలో కార్పొరేట్‌ కళాశాలలను కనుమరుగు చేసి తల్లితండ్రుల కష్టార్జితాన్ని మిగల్చవచ్చు.


- ఇలపావులూరి మురళీ మోహనరావు 

వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top