
పక్కదారి పడుతున్న సన్నబియ్యం
మధ్యాహ్న భోజనం పథకానికి పురుగుల బియ్యం
బియ్యం గోతాలపై కానరాని క్యూఆర్ కోడ్ ట్యాగ్‌లు
ఉపాధ్యాయుల చేతికి క్యూఆర్ కోడ్ ట్యాగ్‌లు ఇచ్చి వెళుతున్న వైనం
కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చిన మోసం
చల్లపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యతతో కూడిన సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తోంది. ఆచరణలో మాత్రం ముక్కిపోయిన పురుగుల బియ్యం పాఠశాలలకు చేరుతున్నాయి. పాఠశాలలకు రావాల్సిన సన్నబియ్యాన్ని కొందరు మాయం చేసి... ఆ గోతాల్లో పురుగులతో కూడిన కోటా బియ్యాన్ని నింపి పంపుతున్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హైస్కూల్ ప్లస్ కళాశాలకు వచ్చిన బియ్యం బస్తాల్లో నల్లని, తెల్లని బారు పురుగులు ఉండటమే ఇందుకు నిదర్శనం.
క్యూఆర్ కోడ్ ట్యాగ్‌లు చేతికి ఇచ్చి..
సాధారణంగా మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రత్యేక గోతాల్లో ప్యాక్ చేసి వాటిపై బ్యాచ్ నంబర్, తేదీ, ఎవరికి, ఎక్కడికి పంపుతున్నారనే వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ కలిగిన ట్యాగ్‌లతో సీలు వేసి మెయిన్ లెవెల్ స్టాక్ పాయింట్(ఎంఎల్‌ఎస్)లకు పంపుతారు. అక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తారు. ఏ గోతంలో బియ్యం వండుతున్నారో దానిపై ఉన్న క్యూఆర్ కోడ్ సీలు ట్యాగ్‌ను కత్తిరించి స్కాన్ చేసి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. బియ్యం పక్కదారి పట్టకుండా నిర్దేశిత పాఠశాలకు చేరినట్లు ధ్రువీకరణ కోసం ఇలా చేస్తారు.
అయితే, బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ సీలు ట్యాగ్ లేకుండానే పాఠశాలలకు చేరుతున్నాయి. కొన్నిసార్లు బియ్యం బస్తాలు దించి క్యూఆర్ కోడ్ ట్యాగ్‌లు విడిగా ఇచ్చి వెళుతున్నట్లు పురిటిగడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కేఎస్‌ఎన్ శర్మ తెలిపారు. ఆ ట్యాగ్‌లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో విద్యార్థులకు కేటాయించిన సన్నబియ్యం పక్కదారి పడుతున్నాయని, పురుగులతో కూడిన కోటా బియ్యం పాఠశాలలకు చేరుతున్నాయని స్పష్టమవుతోంది.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి పంపే ప్రతి బియ్యం బస్తాకు క్యూఆర్ కోడ్‌తో కూడిన సీలు ట్యాగ్‌ను తప్పనిసరిగా వేసి పంపాలి. పురిటిగడ్డ జిల్లా పరిషత్ స్కూలుకు వచ్చిన రైస్ బ్యాగులకు సీలు వేయలేదని గుర్తించాం. బియ్యం సరఫరా చేయటానికి ముందే మా టెక్నికల్ సిబ్బంది గోతాలకు సీలు ట్యాగ్‌లు వేసి స్కాన్ చేసి పంపిస్తారు. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలోని ఎంఎల్‌ఎస్ నుంచి ఈ బియ్యం బస్తాలు ఇక్కడకు వచ్చాయి. బస్తాలపై ఎందుకు సీల్ వేయలేదో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – వి.శ్రీలక్ష్మి, ఏపీ సివిల్ సప్లయీస్ స్టోర్స్ మేనేజర్
పురుగుల బియ్యం వెనక్కి
పురిటిగడ్డ పాఠశాలలో అధికారుల తనిఖీలు
చల్లపల్లి: కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హైస్కూల్ ప్లస్ కళాశాలలో గురువారం అధికారులు తనిఖీలు చేశారు. ‘మధ్యాహ్న భోజనంలో పురుగులు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయీస్ స్టోర్స్ మేనేజర్ వి.శ్రీలక్ష్మి, జిల్లా మేనేజర్ వీవీ శివప్రసాద్, మధ్యాహ్న భోజన పథకం జిల్లా డేటా అనలిస్ట్ మద్దుల లక్ష్మీనరసింహారావు, చల్లపల్లి తహశీల్దార్ డి.వనజాక్షి, రెవెన్యూ, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు కలిసి పాఠశాలను సందర్శించారు. బియ్యంలో పురుగులు ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే ఆ బియ్యాన్ని తిప్పి పంపాలని ఆదేశించారు. కుకింగ్ ఏజెన్సీ సిబ్బందితో మాట్లాడగా... నాలుగైదు సార్లు నీటితో కడుగుతున్నామని, అయినా బియ్యంలో పురుగులు ఉంటున్నాయని వివరించారు. స్థానిక రేషన్ డీలర్‌ను పిలిచి బియ్యం సరఫరాపై ఆరా తీశారు. నాగాయలంక ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి బియ్యం వచ్చాయని, తాను సరఫరా చేయలేదని డీలర్ చెప్పారు. అన్నంలో పురుగులు వచ్చిన విషయాన్ని పరిశీలించి మిడ్ డే మీల్స్ టేస్ట్ రిజిస్టర్‌లో సంతకాలు చేసిన ఉపాధ్యాయులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
కాగా, అన్నంలో పురుగులు వచ్చిన విషయాన్ని దాచిపెట్టకుండా ఎందుకు మీడియాకు చెప్పారని పేరెంట్, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ వైస్ చైర్‌పర్సన్ కుంభా దుర్గాభవానీపై తహశీల్దార్ వనజాక్షి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమెను పదవి నుంచి తొలగించాలని చెప్పారు. దీనిపై దుర్గాభవానీ స్పందిస్తూ ‘నాకు పదవులు ముఖ్యం కాదు. పిల్లల భద్రత, భవిష్యత్తే ముఖ్యం’ అని స్పష్టం చేశారు.
మరోవైపు కొన్ని పాఠశాలలు, వెల్ఫేర్ సంస్థలను పరిశీలించిన సమయంలో మధ్యాహ్న భోజన పథకం రైస్ బ్యాగులకు నిబంధనల ప్రకారం క్యూఆర్ కోడ్ ట్యాగులు వేయకపోవటం గమనించామని జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్ శివరామప్రసాద్ గురువారం తెలిపారు. ట్యాగులు లేకుండా ఎంఎల్‌ఎస్ పాయింట్లకు రైస్ బ్యాగులు సరఫరా చేసిన గుంటూరుకు చెందిన శ్రీవెంకటేశ్వరరావు ఎంటర్‌ప్రైజెస్‌కు నోటీసులు జారీచేసినట్లు పేర్కొన్నారు.