జ్ఞాపకాలు విప్పి చెప్పిన కథనాలు

A spy Chief recounts his life in the shadows - Sakshi

ఉన్నత స్థానంలో పనిచేసిన వ్యక్తి తన జ్ఞాపకాలను రాస్తే అవి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెబుతాయి. అందునా ఆయన ఒక గూఢచార సంస్థకు అధిపతి అయితే? అప్పుడు మామూలుగా మనం ఎప్పటికీ తెలుసుకోలేని వ్యక్తులు, వారి కథనాలు మన ముందుకు వస్తుంటాయి.

‘రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌’(రా)కు అధిపతిగా పనిచేసిన ఎ.ఎస్‌.దులత్‌ తనను తాను ఒక దయ్యంగా అభివర్ణించుకుంటారు. నీడలా ఉండి చేయాల్సిన పని అది కాబట్టి. అందుకే ఆయన తన పుస్తకానికి ‘ఎ లైఫ్‌ ఇన్‌ ద షాడోస్‌’ అనే పేరుపెట్టారు.

ఇందులో ప్రిన్స్‌ చార్లెస్‌కు ఇందిరా గాంధీ ఇచ్చిన ఆతిథ్యం నుంచి, తన భద్రతాధికారి పట్ల మార్గరేట్‌ థాచర్‌ చూపిన ఔదార్యం దాకా ఎన్నో విషయాలున్నాయి. ఇంకా ఢిల్లీలో సిక్కులను చంపుతున్నప్పుడు అప్పటి కాంగ్రెస్‌ నాయకుడు అర్జున్‌ సింగ్‌ ప్రతిస్పందన విశేషమైన ప్రాధాన్యత కలిగినది. 

రెండు అంశాలు జ్ఞాపకాలను తప్పనిసరిగా చదివేలా చేస్తాయి– సుప్రసిద్ధ వ్యక్తులను గురించిన వృత్తాంతాలు, వారి గురించిన పదునైన వ్యాఖ్యలు. రచయిత ఎప్పుడైతే ఒక ‘దయ్యమో’– ఒక జీవితకాలం పాటు ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉన్నతస్థానంలో ఉండి ‘రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌’కు అధిపతిగా పనిచేసిన తర్వాత ఆయన తనను తాను అలాగే అభివర్ణించుకున్నారు– మామూలుగా అయితే మనం ఎప్పటికీ తెలుసుకోలేని వ్యక్తులు, వారి కథనాలు మన ముందుకు వస్తుంటాయి. ఇదే ఎ.ఎస్‌. దులత్‌(అమర్‌జీత్‌ సింగ్‌ దులత్‌) రాసిన ‘ఎ లైఫ్‌ ఇన్‌ ద షాడోస్‌’ పుస్తకాన్ని అంత సరదాగా మలిచింది.

1980లలో ఢిల్లీ సందర్శించే ప్రముఖులకు దులత్‌ భద్రతా అనుసంధాన అధికారిగా ఉండేవారు. అలాంటి ప్రముఖులలో ఒకరు ప్రిన్స్‌ చార్లెస్‌. ఈ బ్రిటన్‌ యువరాజును ఇందిరాగాంధీ భోజనానికి ఆహ్వానించారు. అయితే అదంత బాగా సాగలేదు. ‘‘ఎవరో చితక బాదినట్టిగా భారత ప్రధాని నివాసం నుంచి చార్లెస్‌ బయటపడ్డారు!’’ అని దులత్‌ రాశారు. ‘‘యువర్‌ హైనెస్‌(మహాశయా), భోజనం ఎలా అయ్యింది?’’ అని అడిగాను.

‘‘నన్ను అడగొద్దు,’’ అంటూ ఊపిరి పీల్చుకుంటున్న రీతిలో చార్లెస్‌ కారు ఎక్కారు. ‘‘ఆ మహిళ నిన్ను గడ్డ కట్టించేయగలదు. నీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాయకులను నేను కలిశాను, కానీ ఈ మహిళ ఒక్క మాట కూడా మాట్లాడదు!’’ మార్గరేట్‌ థాచర్‌ (బ్రిటన్‌ మాజీ ప్రధాని) భిన్నమైన ముద్ర వదిలేసి వెళ్లారు. ఈ ఉక్కు మహిళ తన సిబ్బందని ఎంతో జాగ్రత్తగా చూసుకునే బాస్‌గా ఉండేవారు.

థాచర్‌ భద్రతాధికారి గోర్డాన్‌ కేథార్న్‌ ఒక రాత్రి ఆమె గది బయట చలిలో గడుపుతానని చెప్పినప్పుడు థాచర్‌ ఎలా స్పందించారో దులత్‌ రాశారు. ‘‘గోర్డాన్, రాత్రి ఇక్కడే గడపటం గురించి నీవు సీరియస్‌గానే అంటున్నావా?’’ అని ఆమె అడిగారు. ‘‘అవును మేడమ్, అఫ్‌కోర్స్, నిజంగానే’’ అన్నాడు గోర్డాన్‌. అప్పుడు ప్రధాని ఇలా అన్నారు: ‘‘అయితే ఒక నిమిషం ఉండు. బయట చలిగా ఉంది. డెనిస్‌ స్వెటర్లలో ఒకటి నీకు తెచ్చిస్తాను.’’(డెనిస్‌– డెనిస్‌ థాచర్‌. ఆమె భర్త.)

ఆ ప్రయాణంలో థాచర్‌ కారు ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయింది. అద్దాల్లోంచి బయటికి చూస్తూ ఆమె కేథార్న్‌ కారు వెంట జాగింగ్‌ చేయడాన్ని గమనించారు. ముందు సీట్లో డ్రైవర్‌ పక్కనే కూర్చున్న దులత్‌ను మనం అతడికి లిఫ్ట్‌ ఇద్దామా అని అడిగారు. దులత్‌ అంగీకరించి, కేథార్న్‌ లోపలికి వచ్చేలా తన డోరు తెరిచారు.

‘‘నో, నో, నువ్వు అసౌకర్యానికి గురి కావొద్దు,’’ అని వెంటనే థాచర్‌ అన్నారు. ‘‘అతడు మాతో వెనక కూర్చుంటాడు’’. దులత్‌ ఏమంటారంటే – ‘‘ఇలాంటి దృశ్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక భద్రతాధికారికి అసౌకర్యం కలిగించడం కంటే కూడా, బ్రిటన్‌ దేశపు ప్రధాని వెనక సీట్లో ముగ్గురితో సర్దుకుని కూర్చోవడానికి సిద్ధపడ్డారు.’’ దులత్‌ ఉపాఖ్యానాల్లో ఎక్కువగా జ్ఞానీ జైల్‌ సింగ్‌ గురించి ఉన్నాయి.

దులత్‌  రాశారు: ‘‘1982 నుంచి 1987 మధ్య ఆయన చేసిన ప్రతి విదేశీయానంలోనూ నేను వెంట ఉన్నాను.’’ అయితే రాష్ట్రపతి వారి సమక్షంలో లేనప్పుడు నిజమైన సరదా జరిగినట్టుంది. ‘‘ఎప్పుడు మేం కొత్త దేశంలో అడుగు పెట్టినాసరే, ఒకవేళ రాష్ట్రపతితో ప్రయాణిస్తున్న కార్యదర్శి రమేశ్‌ భండారీ అయితే, ఆయన నాతో అనేవారు, ‘పార్టీ నా రూములో’’’.

హోనోలూలూ(అమెరికా నగరం) నుంచి తిరిగివస్తూ, కాసేపటి కోసం హాంకాంగ్‌లో ఆగినప్పుడు ‘‘మేము ఎంత అలసిపోయామంటే, ఒక చక్కటి మసాజ్‌ స్వర్గ తుల్యంగా ఉంటుందనిపించింది... సమీపంలో ఎక్కడైనా మసాజ్‌ సెంటర్‌ ఉందా అని హోటల్‌ ఫ్రంట్‌ డెస్క్‌లో ఉన్నవారిని అడిగాను... తీరా నేను పరుగెత్తుకెళ్లి కనుక్కున్నదల్లా అప్పటికే అక్కడికి మంత్రి పదవి కోసం వేచి చూస్తున్న, సరదా మనిషి అయిన ఎన్‌.కె.పి.సాల్వే నాకంటే ముందు చేరుకున్నారని!’’

ముఖ్యమైన వ్యక్తుల గురించి దులత్‌కు తెలియవచ్చిన విషయాలు చాలా విశేష ప్రాధాన్యత కలిగినవి. 1984లో సిక్కులను హత్య చేస్తున్న కాలంలో కాంగ్రెస్‌ నేత(అప్పుడు మధ్యప్రదేశ్‌ ముఖ్య మంత్రి) అర్జున్‌ సింగ్‌ను దులత్‌ కలిశారు. ‘‘ఒక ముఖ్యమంత్రిగా భోపాల్‌లోని సిక్కులను మీరు కలిసి వారి భయాలను నివృత్తి చేయాలని నేను సూచించాను... కానీ ఆయన కరాఖండీగా నిరా కరించారు. ఆయన ఎలాంటి అంతఃగర్భితమైన సందేశాన్ని వ్యక్తపరి చారంటే, రాజ్యం– భారత ప్రభుత్వం– తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ తరుణంలో సిక్కులు ఇంకేమిటో కాదు, అభద్రతను ఫీల్‌ కావాలి.’’

తన మాజీ సహచరుల్లో ఒకరైన, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు c(అజీత్‌ డోభాల్‌) గురించి కూడా దులత్‌ రాశారు. వారిద్దరూ నార్త్‌ బ్లాక్‌లోని ఇంటెలిజెన్స్‌ కార్యాలయంలోని పార్కింగ్‌ ప్లేసులో మొట్టమొదటిసారి కలిశారు. అప్పట్లో దోవల్‌ యువకుడు, దులత్‌ కంటే మూడేళ్లు జూనియర్‌. ‘‘ఆ రోజుల్లోనే అతడిని చూసినప్పుడల్లా తన కెరియర్‌లో ఎంతో అత్యున్నత స్థానా నికి వెళుతున్న మనిషి ఇక్కడున్నాడు అనిపించేది. దోవల్‌ ప్రతి ఒక్కరికీ స్నేహితుడు, అదేసమయంలో ఎవరి స్నేహితుడూ కాదు. ప్రతిరోజూ అలా వ్యవహరించడం అనేది మనలో చాలామందికి ఎంతో కష్టమైన మార్గం.’’

ఏమైనా దోవల్‌ మారారని దులత్‌ నమ్ముతున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు ఆయన బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కే.ఆడ్వాణీ వీరా రాధకుడు, అలాగే పాకిస్తానీయులతో చర్చలకు సిద్ధంగా ఉండేవారు. ఇప్పుడు మాత్రం ‘‘వారితో చర్చలకు, సర్దుబాటకు ససేమిరా అంటు న్నారు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా కఠిన వైఖరి మీద, నిర్దాక్షిణ్యత మీద, లక్ష్యాలను చేరుకోవడం మీద ఉంది. పాత రోజుల్లో నాకు తెలిసిన దోవల్‌ ఎన్నడూ నరేంద్ర మోదీపై దృష్టి పెట్టేవారు కాదు. ఆయన దృష్టి అంతా తనకు అభిమాన నేత అయిన ఆడ్వాణీ పైనే ఉండేది.’’

‘‘అజిత్‌ గురించి చాలావరకు ప్రశంసించిదగిన కథనాలు నా వద్ద ఎన్నో ఉన్నాయి,’’ అని దులత్‌ కొనసాగిస్తారు. నేననుకోవడం అవి ఆయన వాటిని సీక్వెల్‌ కోసం పదిలపరుచుకుంటున్నట్టున్నారు. వాటి గురించి దోవల్‌ ఏమనుకుంటారోగానీ, వాటిని చదవడానికి నేను మాత్రం వేచి ఉండలేను.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top