ఊహకు అందని ఉక్కిరిబిక్కిరి

Sakshi Guest Column On World War II

కామెంట్‌

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ‘జరగని’ ఒక ఘటన ఆనాటి బ్రిటిష్‌ ఆధిపత్యంలోని భారత సామ్రాజ్యాన్ని వణికించింది. మద్రాస్‌కు అభిముఖంగా ఉన్న పశ్చిమ దిశ ప్రాంతమంతటా భయభ్రాంతులు వ్యాపించాయి. సింగపూర్‌ను లొంగదీసుకున్న జపాన్‌కు తర్వాతి లక్ష్యం ఈ ప్రాంతమే అనుకోవ డమే దీనికి కారణం. దాంతో నగరంలోని 8 లక్షల మందిలో 7 లక్షలమంది కట్టుబట్టలతో పారిపోయారు. మద్రాసు జూ లోని సింహాలు, పులులు, నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, విషసర్పాలను కాల్చి చంపారు... బాంబులు పడితే అవి ఆ గందరగోళంలో జనాల మీద పడకుండా! ఆ యుద్ధానికి అవి మూల్యం చెల్లించాయి. ఊహాత్మకమైన దండయాత్ర ముప్పునకే ఆనాటి ప్రభుత్వం అంతగా ప్రభావితం అయిందా? అవునని ఒప్పుకోక తప్పదు.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఎనభై ఏళ్లు అయినప్పటికీ, ఆ యుద్ధం గురించి మనకు తెలియనిది ఏముంటుందని చాలామంది అనుకుంటారు. అది తప్పు అని ముకుంద్‌ పద్మనాభన్‌ రుజువు చేశారు. అసలేనాడూ సంభవించకనే, నిజంగానే సంభవించిందన్నంతగా ఒక అసంబద్ధ మైన కలవరానికి గురిచేసిన ఒకానొక ఘటనపై తాజాగా ఆయన పుస్తకం రాశారు. దాని పేరు: ‘ద గ్రేట్‌ ఫ్లా్యప్‌ ఆఫ్‌ 1942: హౌ ద రాజ్‌ ప్యానిక్డ్‌ ఓవర్‌ ఎ జపనీస్‌ నాన్‌–ఇన్‌వేషన్‌’.

1942 ఫిబ్రవరిలో సింగపూర్‌ పతనానంతరం... అప్పటికింకా బ్రిటిష్‌ ఆధిపత్యంలోనే ఉన్న భారత సామ్రాజ్యానికి–మరీ ముఖ్యంగా మద్రాస్‌కు అభిముఖంగా ఉన్న పశ్చిమ దిశ ప్రాంతమంతటా భయ భ్రాంతులు వ్యాపించాయి. మలయా ద్వీపకల్పానికి మద్రాసు దగ్గరగా ఉండటమన్నది... సింగపూర్‌ తర్వాత జపాన్‌ తదుపరి దాడి ఇక మద్రాసు మీదనేనన్న సూచనప్రాయతకు తావిచ్చింది. 

అసలక్కడేమీ లేకుండానే, ఊరికే ఊహించుకుని భయపడ్డామని ప్రత్యేకించి మీరు గుర్తు చేసుకున్నప్పుడు ఆ భయాందోళన స్థాయి మరింతదైన గొప్ప దిగ్భ్రమను కలిగిస్తుంది. సింగపూర్‌ పతనం అయ్యే సమయానికి మద్రాసులోని మూడింట ఒక వంతు జనాభా ప్రాణ భయంతో తట్టాబుట్టా వదిలి పారిపోయింది. ఆరు వారాల తర్వాత నగర జనాభా కేవలం 25 శాతమే మిగిలి ఉందని ‘ది ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌’ రాసింది. పాల్‌ జయరాజన్‌ అనే ఐసీఎస్‌ అధికారి అంచనా ప్రకారమైతే మద్రాస్‌ జనాభా 13 శాతానికి తగ్గిపోయింది. దానర్థం 8 లక్షల మందిలో 7 లక్షలమంది కట్టుబట్టలతో నగరాన్ని వదిలి వెళ్లారని! ‘ఈ లెక్క నమ్మశక్యమైనదిగా కనిపించకున్నా, నమ్మశక్యం కానిది గానూ అనిపించడం లేదు’ అని ముకుంద్‌ పద్మనాభన్‌ వ్యాఖ్యానించారు. 

పుస్తకంలో ఆహ్లాదం కలిగించే కథలు చెప్పుకోదగినన్ని ఉన్నప్ప టికీ, వాటిల్లో ఒక్కటి కూడా మద్రాసులో జరిగిన దానిని మించి అద్భు తమైనదేమీ కాదు. ‘‘సింహాలు, పులులు, నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, విషసర్పాలను వెతికి మరీ కాల్చి చంపారు. జపాన్‌ విసిరే బాంబులు కనుక జంతు ప్రదర్శన శాలలను, వాటì  కదలికలను నియంత్రించి ఉంచిన ఆవరణలను (ఎన్‌క్లోజర్‌లు) ధ్వంసం చేసినప్పుడు, వాటి నుంచి క్రూర జంతువులు స్వేచ్ఛగా బయటికి ఉరికి, మనుషుల మీద పడకుండా నివారించటానికి ముందస్తుగానే వాటిని చంపేయాలన్న ఆదేశాలు అమలు అయ్యాయి.’’ చూస్తుంటే ఆనాటి జరగని ఘటనకు అత్యధిక మూల్యం చెల్లించుకున్నది జంతువులే అనిపిస్తోంది. 

నిజంగా ఇటువంటిదే లండన్‌లో జరిగింది. ‘‘1939 సెప్టెంబర్‌ ఆరంభంలో, యుద్ధం మొదలైన మొదటి వారం... విస్తుగొల్పేటంతటి స్థాయిలో 4 లక్షల నుంచి 7 లక్షల 50 వేల దాకా పిల్లులు, శునకాలను చంపేశారని అంచనా.’’ అంటే, బ్రిటిష్‌ ప్రజలు తమ పెంపుడు జీవు లను త్యాగం చేయటానికి కూడా సంకోచించనంతగా ప్రేమిస్తారు!  

మద్రాసు గవర్నరు పారిపోయి ఉండకపోవచ్చు. కానీ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు చేసింది కచ్చితంగా పారిపోవటమే! సర్‌ సిడ్నీ వాడ్స్‌వర్త్‌ ‘‘రెండు కార్లలో తన సతీమణి, డ్రైవరు, బట్లరు, కుక్, మూడు పెంపుడు శునకాలతో అనంతపురం బయలుదేరారు. తమ వాహనాల పైభాగాన పరుపులను కట్టి, వాటిల్లో పింగాణీపాత్రలు, గిన్నెలు, బట్టలు, న్యాయశాస్త్ర గ్రంథాలు, వెండి దీపాల వంటి అవస రమైన, విలువైన సామగ్రిని కుక్కేశారు’’. తిరిగి రెండు వారాల తర్వాత ఆయన వెనక్కు వచ్చారు. ఒక మంచి ఉల్లాసభరితమైన సెలవు సమయాన్ని గడిపాక! 

ఐ.సి.ఎస్‌. అధికారులు మద్రాసును విడిచిపెట్టి పోలేదు. బదు లుగా వారు జపాన్‌ సేనలకు చుక్కయినా దక్కకుండా ఉండేందుకు ‘గొప్ప’ మార్గాలనే కనిపెట్టారు. చెట్టినాడు రాజా సాహచర్యంలో పాల్‌ జయరాజన్‌ మద్రాస్‌ క్లబ్బుల్లో పీకల దాకా మద్యం సేవించారు. తర్వాత, వారంతా కలిసి ‘‘మిగిలిన మద్యాన్నంతా కాలువలో పారబోశారు’’.

ఇక జపాన్‌ బాంబు దాడుల గురించి చింతించాల్సినంత భయం లేని ఢిల్లీలో కవి డబ్లు్య.హెచ్‌. ఆడెన్‌ సోదరుడైన జాన్‌ బిక్నెల్‌ ఆడెన్‌ సౌత్‌ బ్లాక్‌ను రక్షించటానికి ఒక హాస్యాస్పదమైన తలతిక్క పథకాన్ని రూపొందించారు. సౌత్‌బ్లాక్‌ భవంతిని కనిపించనీయ కుండా చేయటం కోసం దట్టమైన పొగ మేఘాలను సృష్టించే ఒక పరికరాన్ని తయారు చేశారు. అయితే అది కేవలం కాలుష్యాన్ని వెదజల్లడానికి మాత్రమే పనికొచ్చింది.

యునైటెడ్‌ ప్రావిన్సు (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌)లో ఒక వదంతి అనియంత్రిత ఆందోళన గాడ్పులను వ్యాపింపజేసింది. ‘‘ఒక జపాన్‌ మనిషి ఆకాశం నుంచి భూమిపైన జరుగుతున్న ఒక వేడుకలోని జనసమూహం మధ్యకు దిగి, వారిని ఉద్దేశించి ప్రసంగించి, తిరిగి అలాగే ఆకాశంలోకి వెళ్లిపోయాడు అనే కథ అది.’’  కళ్లారా చూసినంతగా ఆ వదంతిని అంతా నమ్మేశారు. 

చివరికొచ్చేసరికి పద్మనాభన్‌ ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు. కానీ దురదృష్టవశాత్తూ వాటికి సమాధానాలు మాత్రం చెప్పలేదు. ‘‘కేవలం ఊహాత్మకమైన దండయాత్ర ముప్పునకే భారతదేశం అంతగా ప్రభావితం అయిందా? పాలన యంత్రాంగం ఆ స్థాయిలో అప్రమత్తం అవాల్సి ఉండిందా? దేశవ్యాప్తంగా అంతగా కీకర బీకరలు అవసరమా?’’
సహజంగానే విమర్శలు వచ్చాయి.

‘‘టిబెట్‌లోకి ఉపసంహరించుకోవడానికి గానీ భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోందా? లేక, చివరికి మనం పామిర్‌ పర్వతాలను అధిరోహించి, ప్రపంచ పైకప్పును గానీ చేరుకోబోతున్నామా? ఇంకా ఎక్కడైనా ధైర్య సాహ సాలు మిగిలి ఉన్నాయా?’’ అని ‘ద స్టేట్స్‌మన్‌’ పత్రిక గొప్ప గద్దింపుతో ఉరిమింది. కానీ ఎవరూ ఆ ఉరుమును విన్నట్లు లేరు. 

సరే, ఇంత జరిగినా ‘ద గ్రేట్‌ ఫ్లా్యప్‌...’ రావలసినంతగా ఎందుకు గమనింపునకు రాలేదు? ఎందుకంటే, ‘‘ఇండియా వైపు నుంచి ఒక్క అధికారిక ప్రకటన, ఒక్క పరిగణన కూడా లేకపోవడం వల్ల!’’ మద్రా సును వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయిన తన తాత గారి నుంచి, తన తల్లి నుంచి పద్మనాభన్‌ ఆనాటి విషయాలను తెలుసుకున్నారు. వారు చెప్పిన కథల్ని ఈయన మరింతగా తవ్వి పోశారు. తత్ఫలితంగా నాటి భయాలు ఎంత విస్తృతంగా, ఎంత అతిశయోక్తితో ఉండేవో, తరచు వాటి ప్రతిస్పందన  ఎంత నవ్వు పుట్టించేలా ఉండేదో ఆయన కనుగొన్నారు.

ఇది కనుక మీకు డాడ్స్‌ ఆర్మీ (ప్రహసనం)ని గుర్తు చేసినట్లయితే, అలా గుర్తుకు రావటం తప్పేమీ కాకపోవచ్చు.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Election 2024

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top