నేడు వై.ఎస్. రాజారెడ్డి వర్ధంతి
వక్రీకరణలు పురాణకాలం నుంచే వున్నాయి. అవే సత్యాలని ప్రజలు నమ్మ టమూ వుంది. ఆ యా కాలాలలో వ్యక్తులు తమ స్వార్థాన్ని బట్టి ఓ మహావ్యక్తిని నర హంతకుడిగానూ, నరహంతకుడిని ధీరో దాత్తుడుగానూ చేశారు. ఎంత చేసినా నిజం ఒక రోజు బయటికి వచ్చి తీరుతుంది. సూర్యుడికి మబ్బు అడ్డంగా రావచ్చు, కానీ అది శాశ్వతం కాదు.
మహానేత డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి మీద ఇలాంటి వక్ర ప్రచారమే జరిగింది. ఆయన ఎంత మృదు స్వభావో, అంత కఠినుడని చిత్రీకరించారు. నోరు, ప్రచార సాధనాలు వున్నాయని అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేశారు. అసలు రాజారెడ్డి వేరు, ఈ పాలకులు తమ స్వార్థం కోసం భూతద్దంలో చూపుతున్న రాజారెడ్డి వేరు. పేరుకు తగ్గట్టు మానస రాజసం వున్న వ్యక్తి రాజారెడ్డి. గంభీరమైనరూపం, అచ్చ తెలుగు పంచకట్టు, చురుకైన కళ్ళు, గుబురు మీసాలు, గుండెల్లో అపారమైన తడి, చదువుపట్ల గౌరవం, సహాయం చేయటానికి ఎప్పుడూ ముందుండే గుణం, తన వారు తనకంటే ఎదిగి ఆదర్శంగా నిలబడాలన్న కోరిక – ఇలా ఎన్నో కలిస్తే అది రాజారెడ్డి.
గూండాయిజానికి ఎదురొడ్డి...
1960 ప్రాంతంలో కడప జిల్లా పరిస్థితి, ముఖ్యంగా పులి వెందుల పరిసరాల పరిస్థితి ఈ తరానికి ఏమాత్రం తెలియదు. చాలా గ్రామాలకు కరెంటు సౌకర్యం లేదు. రోడ్డు సౌకర్యం లేదు. ఓ వార్త మరో గ్రామానికి తెలియటానికే రోజులు పట్టేది. ఓ కాలనీలో వున్న ఓ వర్గపు గూండాల ఆధిపత్యం క్రింద పులివెందుల ప్రజలు నలిగిపోయేవారు. దొంగతనాలు, దౌర్జన్యం, దోపిడీ, మామూళ్ల వసూలు – ఇలాంటి అరాచకత్వం వుండేది. ఎదిరిస్తే చంపేసేవాళ్ళు. పోలీసులు కూడా ఆ గూండాలకు భయపడేవారట. దాన్ని ఏ మాత్రం సహించలేక ఎదిరించిన యువకుడు రాజారెడ్డి.
ఆరోజు అది పెద్ద సాహసం. ఎదిరించడమే కాక వారిని పులివెందులలో గానీ, ఇతర గ్రామాలలో గానీ అడుగు పెట్టనివ్వకుండా చేశాడు. రాజారెడ్డి పేరు మారు మ్రోగింది. రాజారెడ్డిని ఏ క్షణం వాళ్లు చంపేస్తారో అనే భయంతో కొందరు ఆయనకు రక్షణగా ఏర్పడ్డారు. ఆఖరి నిమిషం వరకు ఆయన అన్యాయాన్ని ఎదిరించాడు. నేరాలను ఆపాడు. ఆయన ఏ నేరమూ చేయలేదు. నిజానికి ఒక ఋషితుల్యత కనిపించేది ఆయనలో. మితభాషి. కాని జీవితాన్ని చదివిన వ్యక్తి కావడం వల్ల మాట్లాడే ప్రతిమాట ఎంతో విలువను సంతరించుకునేది. ఆహారం, ఆహార్యం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదు. ఏదైనా తినేవాడు. మితంగా తినేవాడు. ఎయిర్ కండీషన్ గదిలో ఎంత హాయిగా పడుకునేవాడో ఏటిగట్టు మీద, చెట్టు నీడన గడ్డి దిండుతో అలానే పడుకునేవాడు. ఆశ్చర్యం వేసేది నాకు. చాలా విషయాలు ఆయనను చూసి నేర్చుకున్నాను.
చిన్నదానికి కూడా చలించిపోయే గుండె వున్నా పైకి గండర గండడు. కడప పార్లమెంటు ఎన్నికల్లో నాలుగుసార్లు కమ్యూనిస్టు అభ్యర్థికి ఏజెంటుగా పనిచేశాడు. వామపక్ష భావజాలం ఇష్టపడే వాడు. అందుకే ఆయనకూ, నాకూ స్నేహం కలిసిందేమో. గజ్జెల మల్లారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి లాంటి కవులు, సాహితీ వేత్తలు ఆయనకు మంచి స్నేహితులు. ఏ రచయిత, ఏ సిద్ధాంతకర్త కలిసినా వారు చెప్పేది శ్రద్ధగా ఓ విద్యార్థి మాదిరిగా వినేవాడు.
అవతలి వ్యక్తిలో ఏ మాత్రం విజ్ఞానం వుందని భావించినా వయసు మరచి గౌరవించేవాడు. పేదవాడి న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లేవాడు. రాజీ అన్నది ఆయనకు తెలీదు. ఎందరి సమస్యలో ఎంతో చాకచక్యంగా పరిష్కరించేవాడు. ఆయనకు పెద్దగా పరిచయం లేకపోయినా, మిమ్మల్ని నమ్మి వచ్చాము అని ఎవరు వచ్చినా అండగా నిలబడిన గుండె ఆయనది.
చిన్నవాడిపైనా పెద్ద మనసు...
నాకూ, ఆయనకూ వయసు తేడా వుంది. చిన్నవాడిని. కానీ కలిశాక, స్నేహ బంధం ఏర్పడ్డాక ఆయన నా చేయి వదలలేదు. నాకు గురువయ్యాడు. ఆప్తుడయ్యాడు. అన్నీ అయ్యాడు. జారి పోతుందేమో అనే భయంతో నా చేయి మరింత గట్టిగా పట్టుకుని నన్ను నా కన్నా బాగా చూసుకున్న వ్యక్తి రాజారెడ్డి. రెండు దశాబ్దాలు పెనవేసుకుపోయిన బాంధవ్యం మాది.
1975లో ఎమర్జెన్సీ విధించినపుడు తిరుపతి నుండి నన్ను, కొందరు మిత్రులను అరెస్టు చేసి హైదరాబాదులోని ముషీరాబాదు జైలులో వుంచారు. తిరుపతిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చురుగ్గా వుండేవాడిని. ఆనాడు దేశం మొత్తం మీద అరెస్టయిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిని నేనే. దాదాపు 21 నెలలు ముషీరాబాదు జైలులో గడిపాము. చదువు, ఆటలు, పెద్దలతో చర్చలు – ఇదీ దినచర్య. మేము వెళ్ళిన కొన్ని మాసాలకు అదే జైలు లోకి డిటెన్యూలుగా వచ్చారు రాజారెడ్డి, ఆయన పెద్ద కుమారుడు జార్జిరెడ్డి. అక్కడ ఆయనను తొలిసారి చూశాను.
ఆయన గాంభీర్యం చూసి పలకరించాలా వద్దా అనే సందే హంలో వుండిపోయాను. రెండవ రోజు అనుకుంటాను, సాయంత్రం వాలీబాల్ కోర్టు దగ్గర నన్ను పలకరించారు. అందరి కంటే చిన్నవాడిని కావడం వల్ల దగ్గరికి తీసుకున్నాడు. ‘నేనూ ఆడచ్చా’ అని అందరినీ అడిగి గ్రౌండులోకి అడుగుపెట్టాడు. నాలో నేనే నవ్వుకున్నా ఈ వయసులో ఈయనకు వాలీబాల్ కావాలా అని. అరగంటలో అర్థమైంది నేను తప్పు అని. ఆయన స్టామినా, ఆడే నైపుణ్యం ఆశ్చర్యం కలిగించాయి.
ఉదయం గార్డెనింగ్ లాంటి పనులు, సాయంత్రం వాలీబాల్, రాత్రి బ్యారక్ మూసేశాక చదువుకోవడం జరిగేది. మధ్యాహ్నం భోజనం అయ్యాక మాత్రం సమయం నెమ్మదిగా కదిలేది. మధ్యా హ్నం నిద్ర నాకు అలవాటు లేదు. బ్యారక్ ముందున్న రేకుల వరండాలో చెస్ బోర్డు ముందు వేసుకుని కూర్చునేవాడిని. దూరం నుంచి చూసి దగ్గరికి వచ్చారు రాజారెడ్డి. ఇద్దరం అడేవాళ్ళం. నిజానికి నాకు ఆడటం రాదు. ఎలా ఆడాలో, ఏ పావును ఎలా కదపాలో ఆయనే చెప్పారు. చాలాసార్లు నేను గెలిచేవాడిని. క్రమంగా అర్థమైంది నన్ను గెలిపించడానికే ఆయన ఓడిపోతున్నాడని.
మరణం లేని మనిషి
రాజారెడ్డి మంచితనాన్ని దాచి, అసత్యప్రచారాలు చేశారు గానీ ఆయన ఏనాడు భూదందాలు చేయలేదు. నిజంగా భూ ఆక్రమణకు ఆయన పాల్పడి వుంటే ఈ రోజు సగం తిరుపతి ఆయన కుటుంబం చేతుల్లో వుండేది. వేముల దగ్గర రాజారెడ్డిని కిరాతకంగా, పాశవికంగా చంపింది పార్థసారథే. అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే ఇది జరిగింది. ఈ హత్యా రాజకీయాల ఫలితం ఓ మంచి మనిషి మరణం.
మరణం అందరికీ తప్పదు కానీ చరిత్ర కొందర్ని గుర్తుంచుకుంటుంది. చీకటి మింగిన సూర్యుడు రాజారెడ్డి. అయినా సూర్యుడి వేడి తగ్గదు, వెలుగూ తగ్గదు. శత్రువులు ఆయుధంతోనూ, నారా సురుల వంటి స్వార్థపరులు మాటల ఈటెలతోనూ రాజారెడ్డి మీద అమానుషమైన దాడి చేశారు. కానీ రాజారెడ్డి ధీరోదాత్తుడు. తన వారికై నిలబడిన వీరుడు. వీరుడు చనిపోడు, చంపబడతాడు.

భూమన కరుణాకర రెడ్డి
వ్యాసకర్త తిరుపతి మాజీ శాసన సభ్యులు


