ఉమ్మడి బాటలో భిన్నాభిప్రాయాలు | Sakshi
Sakshi News home page

ఉమ్మడి బాటలో భిన్నాభిప్రాయాలు

Published Sat, Jul 22 2023 12:46 AM

Sakshi Guest Column On Indian Citizens Uniform Civil Code

ఆదేశిక సూత్రాలకే పరిమితమైన ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) అంశం మళ్లీ తెరమీదికొచ్చింది. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, పోషణ, భరణం వంటి కుటుంబ, వ్యక్తిగత అంశాల్లో ఒకే పౌర నియమాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదేశిక సూత్రాలలో చేర్చడమంటే ఒక విస్తృత ప్రయోజనమున్న చట్టాన్ని బీరువాలకు పరిమితం చేయడం కాదనీ, దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలన్నది ప్రజాస్వామిక వ్యవస్థకు గీటురాయనీ ఒక వాదన. అదే ఆదేశిక సూత్రాలలో ఉన్న సమానత్వం, విద్య, వైద్యం, ఉపాధి వగైరా లాంటి అంశాలకు చట్టాలు ఎందుకు చేయరనీ, ఇది కేవలం ఎన్నికల ఎత్తుగడ మాత్రమేననీ మరొక వాదన.

సమానత్వ సిద్ధాంతం
మిగిలిన చట్టాల మాదిరిగానే ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) కూడా 1948 లోనే రాజ్యాంగంలో ఒక చట్టంగా చోటు చేసుకోకపోవడానికి ప్రధాన కారణం, ఆనాటి పరిస్థితులు. అందరికీ మానసిక సంసిద్ధత సమకూరిన తరువాతనే దానిని తెచ్చే ఆలోచన చేయడం మంచిదన్నది ఒక దశలో రాజ్యాంగ పరిషత్‌ అనివార్యంగా తీసుకున్న నిర్ణయం. ఫలితంగానే ఆ ఆలోచన ఆదేశిక సూత్రాలకు (44వ అధిక రణ) పరిమితమైంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత హింసాత్మక, విషాద ఘట్టంగా చెప్పుకొనే భారతదేశ విభజన, నాటి మత ఉద్రిక్తతలు రాజ్యాంగ పరిషత్‌ పెద్దలను అలాంటి వాయిదా నిర్ణయానికి పురిగొల్పాయి.

ఆదేశిక సూత్రాలలో చేర్చడమంటే ఒక విస్తృత ప్రయోజనమున్న చట్టాన్ని బీరువాలకు పరిమితం చేయడమైతే కాదు. దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలన్నది ప్రజాస్వామిక వ్యవస్థకు గీటురాయి. మతసూత్రాల ఆధారంగా పర్సనల్‌ లా చెల్లుబాటు అయితే రాజ్యాంగమే చెబుతున్న సెక్యులరిస్టు వ్యవస్థలో ఆ భావనకే భంగపాటు. షాబానో విడాకుల కేసు, మనోవర్తి  వివాదం మొదలు (1985) ఇటీవలి కాలం వరకు సుప్రీంకోర్టు కూడా ఉమ్మడి పౌర స్మృతి గురించి కేంద్రానికి గుర్తు చేయడమే కాదు, ఒక సందర్భంలో నిష్టూరమాడింది కూడా.

రాజకీయ చర్చలు, చట్టసభలలో వాగ్యుద్ధాల స్థాయి నుంచి ఎన్నికల హామీ వరకు ఉమ్మడి పౌరస్మృతి ప్రయాణించింది. స్వాతంత్య్రం వచ్చిన తరు వాత 1948 నవంబర్‌ 23న తొలిసారి దీని రూప కల్పన ఆలోచన తెరమీదకు వచ్చింది. రాజ్యాంగ పరిషత్‌లో ఈ ప్రస్తావన తెచ్చినవారు కాంగ్రెస్‌ సభ్యుడు మీను మసానీ. ఇప్పుడు ఆ పార్టీ ఈ అంశం మీద నీళ్లు నమలడం ఒక వైచిత్రి. అంబేడ్కర్, నెహ్రూ, పటేల్, కృపలానీ వంటి వారంతా దీనిని సమర్థించారు. దీని గురించి ప్రతికూల వైఖరి తీసు కుంటున్నవారు ఈ చట్టం ద్వారా మేలు పొందేది మహిళలే అన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. రాజ్యాంగ పరిషత్‌లో హన్సా మెహతా సహా 15 మంది మహిళలు దీని కోసం తపించారు. ఈ స్ఫూర్తి బుజ్జగింపు ధోరణిలో కొట్టుకుపోకుండా చూసు కోవలసిన బాధ్యత ఇవాళ్టి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానిదే. ఉమ్మడి పౌర స్మృతితో దేశం సంత రించుకునే అంశాలుగా చెప్పినవి: స్త్రీ పురుష సమానత్వం, జాతీయ సమైక్యత, సమగ్రత, లౌకికవాదం, వ్యక్తిగత హక్కుల రక్షణ, న్యాయవ్యవస్థ ఆధునీకరణ, భిన్న ఆచారాల సమన్వయం. ఇవన్నీ స్వాతంత్య్రం వచ్చిన ఏడున్నర దశాబ్దాలకు కూడా పౌరులందరికీ సమానంగా లేక పోవడం ఒక దుఃస్థితిని సూచిస్తుంది.  

మద్రాస్‌ నుంచి రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన మహమ్మద్‌ ఇస్మాయిల్‌ దీన్ని వ్యతిరేకించినవారిలో మొదటివారు. నజీరుద్దీన్‌ అహ్మద్, మెహబూబ్‌ అలీ బేగ్, బి.పొకార్‌ సాహెబ్, అహమ్మద్‌ ఇబ్రహీం, హస్రత్‌ మొహానీ ఆయన వెనుక నిలిచారు. ఈ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి వారు ఎన్నుకున్న నినాదం ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’. ఇది కూడా ఒక చారిత్రక వైచిత్రి. వీరి వాదనలోని అంశాలు తమ మత,సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకోవడం, ఉమ్మడి పౌర స్మృతి వస్తే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పడం. ఇప్పుడు కూడా అవే కారణాలు వినిపిస్తున్నాయి. అందుకే దీని మీద చర్చ అనివార్యం. ఇందుకు దోహదం చేస్తున్నదే 22వ లా కమిషన్‌ పిలుపు.ఏదో ఒక కాలంలో ప్రతి మతం స్త్రీని చిన్నచూపు చూసిన మాట వాస్తవం. ఒకనాడు హిందూధర్మం కూడా ఇలాంటి బంధనాలలోనే ఉన్నా, హిందూ కోడ్‌తో చాలావరకు ఆ దుఃస్థితి నుంచి మహిళకు రక్షణ దొరికింది. ఇలాంటి రక్షణ ఏ మతం వారికైనా లభించాల్సిందే. విడాకులు, వివాహం వంటి వ్యక్తిగతఅంశాల్లో దేశ పౌరులందరికీ ఒకే న్యాయం అందించాలన్నదే యూసీసీ ధ్యేయం.

విడాకులు పొందిన మహిళ ఎలాంటి ఆంక్షలు లేకుండా పునర్‌ వివాహం చేసుకునే వెసులుబాటు, దత్తత చట్టం అందరికీ ఒకే విధంగా ఉండడం కూడా ఇందులో భాగమే. ఆస్తిహక్కుకు, వివాహ వయసు 21 సంవత్సరాలు వంటి నియమాలకు మత, వర్గ, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా యూసీసీ పాటు పడుతుంది. ఇవన్నీ స్వాగతించవలసిన అంశాలు.

13వ శతాబ్దానికి చెందిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ కూడా ఢిల్లీ మత పెద్దను కాదని షరియాలో మార్పులు తెచ్చాడు. 1937 నుంచి మాత్రమే భారతీయ ముస్లింలు అమలు చేసుకుంటున్న  ముస్లిం పర్సనల్‌ లా విషయంలో ఇంత రాద్ధాంతం చేయడంలో అర్థం కనిపించదు. అలా అని ఆ పర్సనల్‌ లా యథాతథంగా అమలు చేయగలిగే శక్తి, కాఠిన్యం ఇవాళ వారిలోనూ లేవు. పాకిస్తాన్, ఈజిప్ట్, ట్యునీషియా వంటి దేశాల అనుభవాలు కూడా పర్సనల్‌ లా శిలాశాసనం కాదనే రుజువు చేస్తున్నాయి. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఇటీవలనే హదిత్‌ (ముస్లిం న్యాయసూత్రాలు) పునర్‌ నిర్మాణానికి ఒక సంఘాన్ని నియమించారు. ఈ న్యాయసూత్రాలు ఉగ్రవాదానికి తోడ్పడకుండా ఉండేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. యూసీసీని బీజేపీ తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నది కాబట్టి అది
హిందువుల కోసమేనని చెప్పడం ఆత్మవంచన. రాజ్యాంగ చరిత్ర ఒక మలుపు తీసుకుంటున్న సమయంలో మోకాలడ్డే ప్రయత్నం సరికాదు.
పి. వేణుగోపాల్‌ రెడ్డి,వ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్‌’ వ్యవస్థాపక ఛైర్మన్‌
pvg2020@gmail.com


ఎన్నికల రాద్ధాంతం
‘‘ఒక ఇంట్లో ఒకరికి ఒక చట్టం, మరొకరికి మరొక చట్టం ఉంటే ఆ ఇల్లు నడుస్తుందా? అలాంటి కపట వ్యవస్థతో దేశం ఎలా పనిచేస్తుంది?’’ అన్నారు బీజేపీ ఎన్నికల కార్యకర్తల సభలో ప్రధాని మోదీ. ఈ చర్చ సరైన వేదికపై చేయాలి. ప్రజలను రెచ్చగొట్టరాదు. ప్రశాంత జీవనానికీ, భిన్న కుల, మత, జాతి, సంస్కృతుల మధ్య భారతీయతకూ ‘భిన్నత్వంలో ఏకత్వం’ కారణం. ఈ భిన్నత్వం స్థానంలో వైదిక ఏకత్వాన్ని రుద్దాలన్నది ‘సంఘ్‌’ ఆకాంక్ష.
ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) చట్టాన్ని తేవాలన్నది మోదీ ఆలోచన. ఎన్నికలకు ముందు ముస్లిం మహిళల న్యాయసాధనకు పూనుకుంటారాయన. హిందూ స్త్రీలను పట్టించుకోరు. సాధికా రితకు మహిళా రిజర్వేషన్‌ చట్టం చేయరు. యూసీసీని అమలు చేయమని సుప్రీంకోర్టు అనేక సంద ర్భాలలో ఆదేశించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2024 ఎన్నికల లబ్ధికి ఇప్పుడు ఈ చట్టాన్నిముందుకుతెచ్చారు.

వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, పోషణ, భరణం వంటి కుటుంబ, వ్యక్తిగత అంశాల్లో ఒకే పౌర నియమాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ మతాల ప్రజలు తరతరాలుగా ఆచరిస్తున్న పద్ధతులు, సంప్రదాయాలు అనేకం ఉన్నాయి. భార్యాభర్తలకు, కూతురు కొడుకులకు వేరువేరు దుస్సంప్రదాయాలున్నాయి. అయితే భావజాలం కుదరని చోట చట్టాలతో, చట్టాలు పనిచేయనిచోట భావజాలంతో వీటిని సరిదిద్దాలి. 
ఏకరీతి పౌరసూత్రాల ప్రస్తావన ప్రాథమిక హక్కుల్లో లేదు. రాజ్య విధానాల ఆదేశిక సూత్రాలు ఆసక్తికరమైనవి. వీటి ప్రకారం ప్రభుత్వం శాసన, కార్యనిర్వాహక విధులు నిర్వహించాలి. ఇవి మార్గదర్శకాలే. వీటిని న్యాయవ్యవస్థ ద్వారా అమలుచేయలేము. వీటిని న్యాయస్థానాలలో సవాలు చేయగల చట్టాలను చేయరాదు. సంస్క రణల ద్వారా ఈ సూత్రాలను సాధించాలి. దేశ పౌరులకు ఏకరీతి పౌర నియమావళిని పదిలపర్చే పని రాజ్యం చేయాలని ఆదేశిక సూత్రం 44 చెప్పింది. ఒకేసారి చట్టం చేయరాదనీ, సంస్కరణలతో సాధించాలనీ వివరించింది. ఆదేశిక ఆదేశాలలో సమానత్వం, విద్య, వైద్యం, ఉపాధి, జీవన వేతనాలు, పోషకాహార సరఫరా వగైరా చాలా అంశాలున్నాయి. వీటి అమలుకు మాత్రం చట్టాలు చేయరు.

యూసీసీ అమలులో చిక్కులున్నాయి. దీనిపై ఇప్పటి వరకు జరిగిన రాజ్యాంగ, శాసన చర్చలను పరిగణించాలి. విభిన్న జాతుల, మతాల దేశంలో ఇది ఆచరణ సాధ్యం కాదని తేల్చింది. ఇది కోరదగ్గదే కాని ఐచ్ఛికంగా ఉండాలన్నారు రాజ్యాంగ ముసాయిదా సభ అధ్యక్షులు అంబేడ్కర్‌. యూసీసీ కంటే వివిధ కుటుంబ సంస్కరణలు స్త్రీ, శిశువుల శ్రేయస్సుకు హామీనివ్వగలవు. యూసీసీ ముస్లింల పైనేకాదు, ఇతర అల్పసంఖ్యాక వర్గాలపై, గిరిజనులపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. ఇది అనవసరం, అవాంఛనీయం అని 21వ  లా కమిషన్‌ చెప్పింది. అయినా మరలా 22వ లా కమిషన్‌కు నివేదించడం, అదీ 30 రోజుల స్వల్ప వ్యవధిలో ప్రభావితుల అభిప్రాయాలు కోరడం ఆశ్చర్యం. 

అన్ని మతాల వ్యక్తిగత చట్టాలు మధ్యయుగ మహిళా ద్వేషాలే. ఈ విషయంపై చర్చ జరగదు.‘సంఘ్‌’ ముస్లిం వ్యక్తి చట్టాలనే విమర్శిస్తుంది. వైదికమత నియంతృత్వాన్ని స్థాపిస్తుంది. మత స్వేచ్ఛ హక్కునిచ్చే అధికరణ 25, మత సంస్థల స్థాపన, నిర్వహణ హక్కులను కల్పించే అధికరణ 26, మత మైనారిటీలకు ప్రత్యేక హక్కులనిచ్చిన అధికరణ 29లను యూసీసీ బలహీనపరుస్తుంది. ఉన్న చట్టాలను అమలుచేస్తూనే ఏకీకృతాన్ని సాధించవచ్చు. హిందువులకు కులరహిత ఏకరీతి సూత్రాలను శాసించాలి. ఆ తర్వాతే ఆదేశిక సూత్రాల జోలికి పోవాలి. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్య విలువలను, దేశ సమాఖ్య తత్వాన్ని, సమానత్వ అధికరణలను  తుంగలో తొక్కింది. అధికరణ 47 ప్రకారం ప్రజారోగ్యానికి పోషకాహార స్థాయి, జీవన ప్రమాణాలను
పెంచాలి. ఆరోగ్యానికి హానికరమైన మత్తుపానీయాలను, మాదక ద్రవ్యాలను నిషేధించాలి. యూసీసీకంటే ఇవి చాలా ముఖ్యం. 

సంఘ్‌కు ముస్లింల గుంపు కావాలి. వారిని చూపి హిందుత్వవాదులను రెచ్చగొట్టాలి. అయితే ప్రతిపక్షాలు దీనికి లౌకిక పౌర ప్రత్యామ్నాయ విరుగుడు పద్ధతులను చేపట్టలేదు. ఇప్పుడు విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం. యూసీసీ వద్దంటే ముస్లింవాదులనీ, వైదిక వ్యతిరేకులనీ
నింద. సమర్థిస్తే ముస్లిం వ్యతిరేకులనీ, వైదికవాదులనీ ముద్ర.  చట్టసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టే ముందు దాని ముసాయిదాను సమర్పించాలి. ఆ అంశంలో వాస్తవ పరిస్థితిని తెలపాలి. సంబంధిత గణాంకాలను జోడించాలి. ఆ చట్ట ప్రయోజనాలను వివరించాలి. మోదీ ప్రభుత్వం ఏ చట్టంలోనూ రాజ్యాంగబద్ధంగా ఇవ్వవలసిన ఈ వివరాలను బిల్లుకు జోడించలేదు. ఇల్లు, దేశం ఒకటి కావనీ; రాజ్యాంగ సమానత్వ అమలే ప్రజాస్వామ్యమనీ, పాలకవర్గ కపటమే దేశాన్ని దిగజార్చిందనీ ప్రధాని గ్రహించాలి. కుటుంబ అంశాల్లో ప్రతి మతం పురుషాధిక్య రాజ్యమే. దీన్ని మతాలన్నీ సరిదిద్దుకోవాలి. ఎన్నికల్లో యూసీసీ ప్రభావం లేకుండా చేయాలి. 
హనుమంత రెడ్డి, వ్యాసకర్త ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి
మొబైల్‌: 949020 4545
సంగిరెడ్డి

Advertisement
 
Advertisement