నిజాయితీయే నిజమైన విలువ

Sakshi Guest Column On Honesty true value

కామెంట్‌

చిన్మయ ఘరేఖాన్‌ రాసిన ‘సెంటర్స్‌ ఆఫ్‌ పవర్‌: మై ఇయర్స్‌ ఇన్‌ ది ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఆఫీస్‌ అండ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌’ అనే తాజా పుస్తకం ఆయన రాసుకున్న డైరీల ఆధారంగా రూపొందినది. పుస్తకంలోని రహస్యోద్ఘాటనలు ఇందిరా గాంధీని రెండు విధాలుగా చూపుతాయి. మనోహరంగా, ఆకర్షణీయంగా; అలాగే అభద్రత, అహంకారం కలిగి ఉండి, కుటుంబమే సర్వస్వం అయిన వ్యక్తిగా! ఇందిరా గాంధీలోని ఎవరికీ తెలియని మరికొన్ని కోణాలను కూడా ఘరేఖాన్‌ దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. ఈ విధంగా దేశాధినేతల గురించి, వారికి సమీపంగా దీర్ఘకాలం ఉన్నత పదవులను నిర్వహించినవారు తమ డైరీలలో నిజాయితీగా రాసి పెట్టుకున్న విశేషాలతో తెచ్చిన పుస్తకాలు ఎంతో విలువను, ప్రతిష్ఠను కలిగి ఉంటాయి. 

డైరీలు రాసే సంప్రదాయం మన దగ్గర గట్టిగా లేకపోవడం సిగ్గు చేటు. మళ్లీ బ్రిటిష్‌ వాళ్లకు ఆ భాగ్యం ఉంది. అక్కడి శామ్యూల్‌ పెపిస్‌ నుంచి రిచర్డ్‌ క్రాస్‌మన్‌ వరకు, ఆపై ఉడ్రో వ్యాట్‌ దాకా... పఠనాన్ని మంత్రముగ్ధం చేస్తూ డైరీలు రాశారు. మరీ ముఖ్యంగా దేశాన్ని పాలిస్తున్న స్త్రీ, పురుషుల గురించి వారు తమ డైరీలలో మొత్తం బహిర్గతం చేశారు. లేకుంటే మనం ఆ విశేషాలను ఎప్పటికీ తెలుసుకోగలిగేవాళ్లం కాదు. వారి నిజాయితీనే ఆ డైరీలకుండే నిజమైన విలువ. 

ఉడ్రో వ్యాట్‌ రాసిన మూడు సంపుటాల డైరీల గురించి నాటి ‘సండే టైమ్స్‌’ ఎడిటర్‌ ఆండ్రూ నీల్, ‘‘ఈ దేశ పాలకులు, సామాజిక విశిష్టులకు సంబంధించి చేర్పులు లేని వాస్తవాలను ఇవి కలిగి ఉన్నాయి’’ అని కితాబునిచ్చారు. మార్గరెట్‌ థాచర్‌ జీవిత చరిత్ర కారుడైన ప్రముఖుడు చార్ల్స్‌ మోర్, ‘‘ఆమె తన సన్నిహితుల సమక్షంలో ప్రజా కార్యక్రమాలపై వ్యక్తం చేసిన వ్యక్తిగత ప్రతిస్పందనలు తరచు ఆ డైరీలలో కనిపించేవి’’ అని వ్యాఖ్యానించారు. ఇంకో మాటలో చెప్పాలంటే, అమూల్యమైన అంతర్నేత్ర దృష్టికి వారి డైరీలు నెలవుగా ఉండేవి.  

ఇన్నాళ్లకు, మనకూ అలాంటి ఒక పోల్చుకోదగిన డైరీ లభ్యమైంది! చిన్మయ ఘరేఖాన్‌ రాసిన ‘సెంటర్స్‌ ఆఫ్‌ పవర్‌: మై ఇయర్స్‌ ఇన్‌ ది ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఆఫీస్‌ అండ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌’ అనే పుస్తకం ఆనాడు ఆయన రాసుకున్న డైరీల ఆధారంగా రూపొందినదే. పుస్తకంలోని విశేషాంశాలు ఇందిరా గాంధీని రెండు విధాలుగా చూపుతాయి. మనోహరంగా, ఆకర్షణీయంగా; అలాగే అభద్రత, అహంకారం కలిగి ఉండి, కుటుంబమే సర్వస్వం అయిన వ్యక్తిగా. మరోలా చెప్పా లంటే... ప్రధానమంత్రి వెనుక ఉన్న అసలు స్వరూపాన్నీ (కొన్నిసార్లు ఆ స్వరూపం లోపభూయిష్టంగా ఉంటుంది), అదే సమయంలో... అందరిలాంటి ఒక మామూలు మనిషినీ ఈ పుస్తకం దృగ్గోచరం చేస్తుంది. 

మొదట చిన్న విషయాలు. సమావేశాలలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ తన చేతి గోళ్ల ఎగుడు దిగుడులను అందంగా సమం చేసుకుంటూ కనిపించేవారు. అయినప్పటికీ, ‘‘సమావేశంలోని ఏ మాటా ఆమె చెవులను దాటి వెళ్లేది కాదు’’. ఆమెకు కొన్ని గాఢమైన నమ్మ కాలు ఉండేవి. ‘‘ఇంటి నుండి ఆఫీసుకు బయల్దేరవలసిన ఘడియ లను కూడా ఆమె జ్యోతిష్య పండితులు నిర్ణయించేవారు’’. ఆమెలో హానికరం కాని ‘పట్టిపీడించే ఆలోచనలు’ (అబ్సెషన్స్‌) కొన్ని ఉండేవి. ‘‘లేఖలు రాయడాన్ని ఇందిరా గాంధీ ఇష్టపడేవారు.

అంతకంటే కూడా లేఖల చిత్తుప్రతుల్ని, ప్రసంగ పాఠాలను, సందేశాలను స్వయంగా సవరించడానికి ఆసక్తి కనబరిచేవారు’’. ఇక ఆ పూట భోజనంలోకి ఏయే వంటకాలు ఉండాలన్నది నిర్ణయించడానికి గంటల సమయం వెచ్చించేవారు. కామన్‌వెల్త్‌ సదస్సుకు హాజరైన ప్రభుత్వాధినేతల కోసం ఆమె భారత దౌత్యవేత్త శంకర్‌ బాజ్‌పేయితో కలిసి మెనూ తయారీకి 45 నిముషాల సమయం తీసుకున్నారు. బ్రిటన్‌ రాణిగారికి ఉదయం పూట అల్పాహారంలో, మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రం విందులోకి ఏమేమి తయారు చేస్తున్నారో ఆ జాబితానూ ప్రతిరోజూ తను చూడాలని కోరుకునేవారు. 

బ్రిటన్‌ పట్ల ఇందిరా గాంధీ వైఖరి గురించి ఘరేఖాన్‌ తన పుస్తకంలో రాసిన విషయాలను చదివి నేను పరవశుడినయ్యాను. ‘‘ప్రధాని ఇందిరా గాంధీ బ్రిటన్‌ను, ప్రధానంగా బ్రిటన్‌ రాచకుటుంబీకులను ఎప్పుడూ కూడా ఇష్టపడకుండా లేరు’’. 1983లో రాణిగారికి లండన్‌లోని ఇండియన్‌ హై కమిషనర్‌ నివాస గృహంలో భోజన ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు... న్యూయార్క్‌ నుంచి నేరుగా భారత్‌కు తిరిగి వస్తున్న ఇందిరా గాంధీ అర్ధంతరంగా లండన్‌లో దిగి... భారత హై కమిషనర్, ఆయన భార్య ఆ ప్రత్యేక భోజన సందర్భాన్ని చక్క గానే నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని నిర్ధారించుకున్నారు. ‘‘రాణి గారి సమక్షంలో ఎలా ప్రవర్తించవలసిందీ హై కమిషనర్‌కు చెప్పారు’’. (ఎప్పుడూ కూడా రాణిగారి వైపు మీ వీపు భాగం తిరిగి ఉండకూడదని సూచించారు).   

ఇందిరా గాంధీ తోట పని చేసేవారు. ఇంట్లో ఫర్నిచర్‌ అమరికల్లో తరచు మార్పులు చేస్తుండేవారు. వాకిళ్లకు, కిటికీలకు వేసే పరదాలలో కొత్త డిజైన్‌ల ఎంపిక కోసం ఇంటి అలంకరణ నిపుణులకు – ప్రత్యేక అతిథులను తోడుగా ఇచ్చి – విదేశాలకు పంపుతుండేవారు. ఆ ప్రత్యేక అతిథులలో రాజవంశీయుడైన మాధవరావు సింధియా కూడా ఒకరు. 

1981లో ప్రిన్స్‌ చార్ల్స్‌ వివాహ మహోత్సవానికి హాజరు అయేందుకు అమితమైన అసక్తిని కనబరిచి కూడా చివరికి హాజరు కాలేకపోయినందుకు ఇందిరా గాంధీ ఎంతగానో నిరాశకు లోనయ్యా రని ఘరేఖాన్‌ రాశారు. ‘‘అప్పుడు ఆమెలో కనిపించిన ఆ స్థాయి నిస్పృహను మునుపెన్నడూ నేను చూడలేదు’’ అని ఘరేఖాన్‌ తన డైరీలో పేర్కొన్నారు. చార్ల్స్‌ పెళ్లి వేడుకకు తను వెళ్లడం లేదని మొదట చెప్పిన రాష్ట్రపతి ఆ తర్వాత వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ప్రధాని ఆగిపోవలసి వచ్చింది. 

ఇందిరా గాంధీ నోబెల్‌ శాంతి బహుమతిని అమిత ఆపేక్షగా కోరుకున్నారని కూడా పుస్తకంలో ఉంది. బహుమతిని దక్కించే ప్రచారం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటైంది. ఆ కమిటీకి ఘరేఖాన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. నిజానికి ‘ఘనత’ పట్ల ఆమె భ్రాంతికి ఇదొ క్కటే నిదర్శనం కాదు. ‘‘ఇతర నాయకులను, చివరికి రాష్ట్రపతులను కూడా ఆమె తన దగ్గరికి పిలిపించుకోవడాన్ని గొప్పగా భావించే వారు’’. ఆమె ప్రత్యేక సహాయకుడు ఆర్‌.కె. ధావన్‌ ఆమెను కలవ వలసిందిగా రాష్ట్రపతులకు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా సమాచారం పంపేవారు. 

ఇందిరా గాంధీలో ఉన్న ఒక వింతైన కోణాన్ని కూడా ఘరేఖాన్‌ దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. 1983 ఓస్లో పర్యటన సందర్భంగా సోనియా గాంధీ భారత రాయబారికి దిగువన ఉన్న వరుసలో కూర్చో వలసి వచ్చింది. ‘‘అప్పుడు ప్రధాని ఇందిర... సోనియాను పైవరుసకు చేర్చారు’’. అదేమీ నార్వే దేశ ప్రొటోకాల్‌కు అనుగుణంగా జరిగింది కాదు. సోనియాకు ప్రాముఖ్యం కల్పించడమే ఇందిరా గాంధీకి ప్రధానం అయింది. 

నిజానికి రాయబారులను తక్కువగా చూడటం అసాధారణ మేమీ కాదన్నట్లుగా కనిపించే అనేక సంఘటనల్ని ఈ పుస్తకం పేర్కొంది.  ‘‘ఇందిరా గాంధీ ఎంతో అలవోకగా రాయబారులతో ఉదాసీనంగా, ధిక్కారంగా ప్రవర్తించడాన్ని నేను గ్రహించాను’’ అని రాసుకున్నారు ఘరేఖాన్‌.  

ఘరేఖాన్‌ పేర్కొన్న సందర్భాలు ఎంత ఆసక్తిని రేకెత్తించేవీ,ఆంతరంగిక విషయాలను బహిర్గతం చేసేవీ అయినప్పటికీ... అవి ఇందిరా గాంధీ మరణించిన నలభై సంవత్సరాల తర్వాత పుస్తకంగా బయటికి వచ్చినవి. అదే మన్మోహన్‌ సింగ్, నరేంద్ర మోదీ హయాంలోని రాజకీయ ప్రముఖులెవరైనా డైరీలు రాసి ఉంటే అవి ఇప్పుడు ఇంకెంత ఆకట్టుకునేలా ఉంటాయో కదా? రచయితలకు కూడా ఆ డైరీలు ఆకర్షణీయతను తెస్తాయి.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top