సందర్భం
భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా అడుగులు వేస్తోందన్న ఉత్సాహం ఓవైపు వ్యక్తమవు తుంటే, మరోవైపు రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోతోంది. ఇది సగటు భారతీయుడి కొనుగోలు శక్తినీ, దేశ ఆర్థిక స్వావలంబననూ ప్రత్యక్షంగా ప్రభావితం చేసే పరిణామం. ఈ నేపథ్యంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన 5 బిలియన్ డాలర్ల విలువైన ‘డాలర్–రూపాయి మార్పిడి ఒప్పందం’ (స్వాప్) మే 26న అమల్లోకి రానుంది.
ఈ ఒప్పందంలో భాగంగా వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న డాలర్లను తాత్కాలికంగా రిజర్వ్ బ్యాంక్‌కు అప్పగించి, బదులుగా రూపాయిలను పొందుతాయి. ముందే నిర్ణయించిన షరతుల ప్రకారం, మూడేళ్ల అనంతరం ఈ మార్పిడి వ్యతిరేక దిశలో జరుగుతుంది. మార్కెట్లో ద్రవ్యలభ్యతను సమతుల్యం చేయడం, ఆర్థిక వ్యవస్థపై ఏర్పడే స్వల్పకాలిక ఒత్తిడిని తగ్గించడం వంటి లక్ష్యాలతో, తాత్కాలిక తరుణోపాయంగా ఈ చర్యను చేపడుతున్నారు.
రూపాయి బలహీనతకు కారణాలెన్నో!
రూపాయి బలహీనతకు దారితీసిన మూలకారణాలు, సంబంధిత అంశాలను పరిశీలించినప్పుడే – ఈ ఒప్పందం ప్రభావాన్ని, దాని పరిమితులను అర్థం చేసుకోగలుగుతాం. గతంలో నెమ్మదిగా, క్రమపద్ధతిలో సాగిన రూపాయి క్షీణత, గత పద్దెనిమిది నెలల్లో ఊహించని వేగాన్నందుకుంటూ, ప్రస్తుతం 96.90 రూపాయల కనిష్ఠాన్ని చేరుకుంది. ఈ పతనానికి ప్రధాన కారణం – పశ్చి మాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడమే. మన దేశ చమురు అవసరాల్లో 88 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున, సహజంగానే రూపాయి విలువపై ఒత్తిడి తీవ్రతరమైంది. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడంతో, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కూడా ఈ ప్రతికూలతను మరింత పెంచింది.
మన వాణిజ్య లోటు వంటి అంతర్గత లోపాలు కూడా రూపాయి బలహీనతకు తోడవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మన వస్తు–సేవల నికర వాణిజ్యలోటు సుమారు 120 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఎన్నో ఆకాంక్షలతో ప్రారంభమైన ‘మేక్ ఇన్ ఇండియా’ ఉద్యమం ద్వారా రక్షణ, చరవాణులు, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ; వాటి తయారీకి అవసరమైన విడిభాగాలను ఇప్పటికీ దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం – ముడిపదార్థాల సమీకరణ నుంచి ప్రాసెసింగ్, అంతిమ తయారీ, వినియోగం లేదా ఎగుమతి వరకు విస్తరించిన సమగ్ర పారిశ్రామిక శృంఖలాలను దేశీయంగా నిర్మించలేకపోవడమే.
వ్యవసాయాధారిత భారతదేశంలో, గ్రామీణ సరఫరా గొలుసులను ఆధునికీకరించి; వాటిని ప్రధాన స్రవంతి తయారీ రంగంతో అనుసంధానించినప్పుడే, మేక్ ఇన్ ఇండియా ఉద్యమ లక్ష్యం సాకారమవుతుంది. ఉదాహరణకు – నిజామాబాద్‌లో ఉత్పత్తయ్యే దారంతో పోచంపల్లిలో నేసిన పట్టు చీరను, హైదరాబాద్‌లోని గోల్కొండ వంటి హస్తకళా కేంద్రాల్లో ప్రదర్శించి; హైటెక్ సిటీలోని అంకుర సంస్థలు – ఆ సంప్రదాయ ఉత్పత్తులు విదేశాల్లోని ప్రవాస భారతీయులకు చేరేలా, డిజిటల్ వేదికల ద్వారా ప్రచారం చేయగలగాలి. ఇందులో ఏ దశ కోసం విదేశాలపై ఆధారపడినా, దేశం ఎంతోకొంత విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తుంది.
హాట్ మనీ కూల్ కాదు!
రూపాయి పతనం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వంటి పరిణామాలకు ప్రతిస్పందనగా, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐలు) తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని డాలర్లుగా మార్చుకుంటారు. దీంతో రూపాయి మరింత బలహీనపడుతుంది. ఇటువంటి స్వల్పకాలిక ‘హాట్ మనీ’ లేదా ‘చంచలమైన పెట్టుబడుల’పై అధికంగా ఆధారపడే ఆర్థిక వ్యవస్థలు, మరింత సులభంగా బాహ్య ప్రకంపనలకు గురవుతాయి. వీటికి భిన్నంగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి పునాది వేస్తాయి. ఈ దిశగా, ప్రభుత్వం రక్షణ, టెలికాం, ఇన్సూరెన్స్, అంత రిక్ష అన్వేషణ వంటి రంగాల్లో పరిమితులను పెంచడం ద్వారా; ఈ ప్రవాహాలు పెరిగే మార్గం సుగమం చేసింది.
అందుకు తోడుగా– అనుమతుల ప్రక్రియను ఏకగవాక్ష విధానాల ద్వారా మరింత సరళీకరించడం, మౌలిక సదుపాయాలను ఇతోధికంగా బలోపేతం చేయడం, వనరుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం, అవసరమైన ప్రోత్సాహకాలు కల్పించడం వంటి చర్యలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. సమాంతరంగా, అనవసర విదేశీ మారకద్రవ్య వ్యయానికి కత్తెర వేయడం కూడా అంతే ముఖ్యం. సికింద్రాబాద్ వేదికగా ప్రధాని సూచించిన విదేశీ మారకద్రవ్య పొదుపు సూచనలు, ప్రభుత్వపరంగా తగిన విధానపరమైన చర్యలు చేపట్టినప్పుడే సమర్థవంతమైన ఆచరణకు నోచుకుంటాయి.
విధానపర సంస్కరణలు
ప్రస్తుతం మన ముందున్న సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో, దేశానికి ఉన్న ప్రధాన రక్షణ కవచం మనవద్దనున్న దాదాపు 700 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలు. వీటిని మరింత బలోపేతం చేయాలంటే, మరికొన్ని విధానపరమైన సంస్కరణలు అవసరం– విలాసవంతమైన దిగుమతి వస్తువులపై సుంకాలను పెంచడం, ప్రపంచ స్థిరాదాయ పెట్టుబడి పత్రాల సూచీలలో భారత్‌కు మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకోవడం; రష్యా, ఇరాన్ వంటి దేశాలతో అమలు చేస్తున్న రూపాయి చెల్లింపు విధానాలను, మరిన్ని దేశాలకు విస్తరించడం. ఈ చర్యల ద్వారా డాలర్‌పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించవచ్చు.
చరిత్రను పునరావలోకనం చేసుకుంటే, చంద్రశేఖర్, పి.వి. నరసింహారావు ప్రభుత్వాల కాలంలో, అత్యవసర స్థితిలో దేశాన్ని గట్టెక్కించేందుకు, రిజర్వ్ బ్యాంక్ దాదాపు 67 టన్నుల బంగారాన్ని విదేశీ బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి డాలరు రుణాలను సమీకరించింది. ఆ గడ్డు పరిస్థితితో పోల్చితే, నేడు భారత్ మరింత సురక్షితంగా ఉంది. అయితే, ఒకప్పుడు గణనీయమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కలిగి ఉన్న టర్కీ, అర్జెంటీనా వంటి దేశాలు కూడా తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. ఆ దేశాల అనుభవాలు... విదేశీ మారక నిల్వలు ఒక విధమైన రక్షణ కవచమే గానీ శాశ్వత పరిష్కారం కావన్న వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి.
క్లుప్తంగా చెప్పాలంటే రూపాయి నిరంతర బలహీనత, మన ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణ పరమైన లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తుచేస్తోంది. ఆకాశమంత ఉన్నతంగా ఉన్న మన ఆర్థిక ఆకాంక్షలు నిజం కావాలంటే; ఉత్పాదకత పెంపు, స్థిరమైన పెట్టుబడుల ఆకర్షణల దిశగా మరిన్ని నిర్ణయాత్మక సంస్కరణలు చేపట్టాలి. ఆర్థిక ప్రయోజనాలు ఆకాశాన్ని తాకాలంటే, రూపాయి పాతాళం వైపు జారకుండా నిలబెట్టే పటిష్ఠమైన పునాదులు ఉండాలి.
కృష్ణబాలాజీ పల్లపోతు
వ్యాసకర్త ఎస్‌బీఐ మాజీ ఉన్నతాధికారి


