నిజాలు నిగ్గు తేల్చాల్సిందే

Opinions Of Legal Experts On Allegations Of Corruption Against Supreme Court Judge - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొన్ని రోజులక్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనా, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యవహారాలపైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డేకి రాసిన లేఖ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆ లేఖపై సుప్రీంకోర్టు విచారణ జరిపించి, నిజానిజాలను నిగ్గు తేల్చాలని న్యాయకోవిదులు, ప్రముఖ న్యాయవాదులు కోరుతున్నారు. ఆ విచారణ పారదర్శకంగా ఉండాలని, అన్ని వాస్తవాలను ప్రజలముందు ఉంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఉత్తములను, ప్రతిభావంతులను న్యాయమూర్తులుగా ఎంపిక చేయడంలో కొలీజియం వ్యవస్థ విఫలమైందంటున్నారు. పర్యవసానంగానే ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నది వారి అభిప్రాయం. బ్రిటన్, అమెరికాల తరహాలో జవాబుదారీతనాన్ని నిర్దే శించే పకడ్బందీ నిర్మాణ స్వరూపం ఉన్నప్పుడే మెరుగైన న్యాయవ్యవస్థ సాధ్యమవుతుందని వారి భావన.

నియామకాలు ప్రశ్నార్థకం... బదిలీలు ఏకపక్షం
కొలీజియం వ్యవస్థ ద్వారా సాగుతున్న న్యాయమూర్తుల నియామకాలు, పదో న్నతులు, బదిలీలు వ్యక్తి ఆరాధనా సంస్కృతిని తీసుకొచ్చాయని, న్యాయ నియా మకాల కమిషన్‌ వంటి ఆదర్శనీయమైన విధానం అమల్లోకొస్తే తప్ప ఈ సంస్కృతి అంతరించే అవకాశం లేదని ప్రముఖ న్యాయకోవిదుడు, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏపీ షా అభిప్రాయపడ్డారు. కొలీజియం వ్యవస్థ  రాజ్యాంగ వంచన తప్ప మరేమీ కాదని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్‌కు రాసిన లేఖ, తదనంతర పరిణామాలపై ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయా ల్లోని ముఖ్యాంశాలు.

కొలీజియం వ్యవస్థ ఒక క్లబ్‌గా, గూడు పుఠాణిగా సాగుతోంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనది. ప్రశ్నార్థకమైన నియామకాలు, ఏకపక్ష బదిలీలు మన న్యాయ వ్యవస్థలో ఎన్నో. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. ముర ళీధర్, బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి (ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్‌ ఏకే కురేషీ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ ఎస్‌పీ భట్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లను వివాదాస్పదమైన రీతిలో, అనూహ్యంగా బదిలీ చేశారు. ఈ ఏకపక్ష నిర్ణయాలకు ఖచ్చి తంగా కొలీజియం విధానమే కారణం.

ఆరోపణలు చేయవద్దనడం అర్ధరహితం
సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వచ్చిన న్యాయమూర్తిని, ఆయన ఇంత క్రితం పనిచేసివచ్చిన హైకోర్టుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కొలీజియం సంప్రదిస్తోంది. ఫలితంగా హైకోర్టు న్యాయమూర్తుల భవిష్యత్తు అవకాశాలన్నీ ఆ సీనియర్‌ న్యాయమూర్తి ఇష్టాయిష్టాలపై ఆధారపడి వుంటాయి. ఇలా సుప్రీం కోర్టులోని ప్రతి న్యాయమూర్తికీ చాలా పలుకుబడి వుంటుంది. అయితే వారిలో కొందరు తెలివైనవారు దాన్ని ఉపయోగించరు. రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగానికి నాయకత్వంవహిస్తున్నవారు, మరో రాజ్యాంగ వ్యవస్థకు చెందినవారిపై ఆరోపణలు చేయడం సరైందేనా అనేది ఇప్పుడు అర్థరహితమైన చర్చ. జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ఆరోపణన్నీ ఇప్పుడు జనసామాన్యంలో ఉన్నాయి. కనుక వాటిపై తీసుకునే నిర్ణయం కూడా అందరికీ తెలిసేవిధంగానే వుండాలి. ఒక అంతర్గత కమిటీ ద్వారా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తారా లేక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తే స్వయంగా దీన్ని విచారిస్తారా అన్నది తేల్చుకోవాలి. భూ లావాదేవీలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై జగన్‌మోహన్‌రెడ్డి లేఖలో ప్రస్తావనకు రాని న్యాయమూర్తులతో విచారణ జరిపించాలి. ఆ విచారణ పారదర్శకంగా వుండాలి. అది వెంటనే మొదలు కావాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబో తున్న వారిపై ఇలాంటి ఆరోపణలు రావడం బహుశా ఇదే మొదటిసారి. ఆ రకంగా చూస్తే అది అసాధారణమైనది. పైగా ఒక ముఖ్యమంత్రే ఆ ఆరోపణలను బహిరంగపర్చే ధైర్యం చేయడం మరింత అసాధారణమైనది. ఇందులోని నిజానిజాలు తేల్చనంతకాలం ప్రజానీకం మనసుల్లో అవి సజీవంగా వుంటాయి. ఈ లేఖ న్యాయవ్యవస్థపై ప్రజల కుండే విశ్వాసాన్ని ఒక కుదుపు కుదిపింది. కనుక న్యాయవ్యవస్థ దీనిపై మౌనంగా వుండిపోకుండా తగినవిధంగా వ్యవహరించాలి.

ఇది విస్తృత సమస్య
జస్టిస్‌ ఎన్‌వి రమణ కుమార్తెలపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌పై ఎలాంటి వార్తలు రాకూడ దంటూ హైకోర్టు విధించిన గ్యాగ్‌ ఆర్డర్‌ గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన నిర్ణయానికి విరుద్ధమైనది. న్యాయవ్యవస్థ ఇసుకలోన తలదూర్చిన ఉష్ట్రపక్షి బాప తుగా వున్నదని... అది వాస్తవ ప్రపంచాన్ని ఎదుర్కొనడానికి, సమస్యలతో నేరుగా వ్యవహరించడానికి సిద్ధంగాలేదని అందరూ అనుకునేలా చేసింది. జగన్‌మోహన్‌ రెడ్డి లేఖను ఒక రాజకీయ నాయకుడికి, ఒక న్యాయమూర్తికి సంబంధించిన అంశంగా చూడకూడదు. ఇది అంతకన్నా విస్తృత మైనది. వ్యవస్థీకృత సమస్య.

గత కొన్నేళ్లుగా న్యాయవ్యవస్థకు ఒక దాని తర్వాత ఒకటిగా సంక్షోభాలు వస్తున్నాయి. ఇది న్యాయమూర్తుల మీడియా సమావేశంతో మొదలైంది. జవాబు దారీతనం కోసం మనకు అభిశంసన వుంది. కానీ అది సంక్లిష్టమైనది. ఆచరించడానికి కష్టమైనది. మరొకటి అంతర్గత కమిటీ. అది చాలా బల హీనమైనది. తప్పు చేశారని గుర్తించిన న్యాయమూర్తికి విధించదగ్గ పెనాల్టీ ఏమిటో స్పష్టత లేదు. ఆరోపణలు పెరుగుతూ... వ్యవస్థ ప్రతిష్ట మసక బారు తున్నప్పుడు ఒక పటిష్టమైన, స్పష్టమైన జవాబుదారీ వ్యవస్థ ఏర్పడాలి. దుర దృష్టవశాత్తూ అందుకు అవసరమైన చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ విధానం లేదు. కొన్నేళ్లక్రితం జవాబుదారీతనాన్ని నిర్ణయించే బిల్లు రూపొందింది. కానీ అది కాస్తా మురిగిపోయింది. అందులో ఎన్ని లోపాలున్నా న్యాయ సంస్కరణలు ప్రారంభించడానికి అదొక ప్రాతిపదికగా వుండేది. బ్రిటన్, అమెరికా తరహాలో జవాబుదారీతనాన్ని నిర్దేశించే లిఖితపూర్వకమైన కోడ్, పకడ్బందీ నిర్మాణ స్వరూపం మనకు అత్యవసరం.

జస్టిస్‌ ఏపీ షా 

(ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సౌజన్యంతో)

న్యాయస్థానంలో తుపాను..
ప్రజాస్వామ్యం చిట్టచివరి కాపలాదారు అయిన న్యాయవ్యవస్థ తనపై అనుమానాలకు అతీతంగా తన్నుతాను కాపాడుకోవాలి. 2021 ఏప్రిల్‌ 24న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీస్వీకారం చేయవలసిన రెండో స్థానంలో ఉన్న సీనియర్‌ జడ్జికి వ్యతిరేకంగా వచ్చిన తీవ్రమైన ఆరోపణలను పరిష్కరించవలసిన అవాంఛిత భారాన్ని ప్రస్తుతం న్యాయవ్యవస్థ మోస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన తీవ్రమైన ఆరోపణలను సుప్రీంకోర్టు సులభంగా తోసిపారేయలేదు. ఆయన తన ఆరోపణల నివేదికను అక్టోబర్‌ 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డేకి సమర్పించారు, అక్టోబర్‌ 10న ముఖ్యమంత్రి ప్రధాన సలహా దారు అజయ్‌ కల్లాం విజయవాడలో ఆ నివేదికను మీడియాకు విడుదల చేశారు. దీనికి వ్యతిరేకంగా ఇద్దరు న్యాయవాదులు సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కార్యనిర్వాహకవర్గం, న్యాయస్థానంపై స్వారీ చేయకూడదని పిటిషనర్లు పేర్కొన్నారు.  

అయితే జడ్జీలపై ఫిర్యాదు చేసినవారిలో ఏపీ ముఖ్యమంత్రే మొదటివారు కారు. 1960లలో ఏపీ ముఖ్యమంత్రి డి. సంజీవయ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రారెడ్డి న్యాయస్థానంలో కులతత్వాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ నాటి హోంమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును సానుకూలంగా పరిష్కరించారు. ప్రస్తుత కేసులో ఏపీ సీఎం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి దాన్ని బహిర్గతం చేయడమనేది స్పష్టంగానే న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే ప్రయత్నమనీ, ఇది కచ్చితంగా కోర్టు ఉల్లంఘన కిందికి వస్తుందనీ సుప్రీంకోర్టు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇలాంటి ఎత్తుగడలను భారతీయ బార్‌ కౌన్సిల్‌ కూడా ఖండిం చింది. అయితే విమర్శల నోరు మూయించడానికి కోర్టు ధిక్కారం అనేది ఎల్లప్పూడూ తొలి ఆయుధంగా ఉపయోగించరాదు.

సుప్రీంకోర్టు పనితీరు సరిగా లేదని, ముఖ్యమైన కేసులను ఎంపిక చేసుకున్న బెంచ్‌లకే కేటాయిస్తున్నారని ప్రకటిస్తూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 2018 జనవరి 12వ తేదీన ఢిల్లీలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి మరీ ఆరోపించినప్పుడే న్యాయవ్యవస్థ దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంది. జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కూడా ఇదే చట్రాన్ని పాటిస్తోందని ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి. జవాబుదారీతనం లేకుండా న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రం ఉనికిలో ఉండదు. జస్టిస్‌ రమణ, ఏపీ హైకోర్టులోని నలుగురు న్యాయమూర్తులపై ఏపీ సీఎం చేసిన ఆరోపణలను సులభంగానే నిర్ధారించవచ్చు. ఈ ఆరోపణలు నిజం కాదని విచారణలో తేలితే ఏపీ ముఖ్యమంత్రిపై కోర్టు ధిక్కార నేరం మోపవచ్చు.

కానీ ఏపీ సీఎం ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లయితే, దానిపై తీర్మానం చేయడం సమస్యలను కొనితెస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124 (4) చెబుతున్నది ఏమిటంటే, ‘‘పార్లమెంటులోని రెండు సభల్లో ఉన్న సభ్యుల్లోని మెజారిటీ ఆమోదించిన తర్పాత రాష్ట్రపతి ఆదేశం ప్రకారం తప్ప మరేవిధంగానూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తన పదవి నుంచి తొలగించలేరు. పైగా దుష్ప్రవర్తన లేక అసమర్థత ప్రాతిపదికన పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది సభ్యుల మెజారిటీ మద్దతుతో మాత్రమే న్యాయమూర్తిని తొలగించగలరు’’. అందుకే న్యాయమూర్తిని తొలగించాలనుకుంటే అది మాటల్లో చెప్పినంత సులభం కాదు.
(ది స్టేట్స్‌మన్‌ సంపాదకీయం)

నిగూఢతవల్లే సమస్య..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిన లేఖ.. న్యాయమూర్తుల ప్రవర్తనపై తలెత్తుతున్న అనేక ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని ఏర్పర్చాల్సిన అవకాశాన్ని న్యాయవ్యవస్థకు అందించింది. అమరావతి రాజధాని ప్రాజెక్టుకు సంబంధించిన వివాదాస్పద భూముల కొనుగోలులో జస్టిస్‌ ఎన్‌వి రమణ కుమార్తెలకు పాత్ర ఉందని ఆరోపిస్తున్న ఏపీ సీఎం లేఖలోని వాస్తవాలు, తదితర వివరాలకు నేను పూచీపడలేను కానీ రాజ్యాం గబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి మరొక రాజ్యాంగ ప్రతినిధి అయిన న్యాయమూర్తిపై లాంఛనప్రాయంగా ఫిర్యాదు చేసినప్పుడు, ఆ ఫిర్యాదులో తీవ్రమైన అరోపణలు ఉన్నప్పుడు ఆ లేఖను తప్పక పరిశీలించాల్సి ఉంటుంది. ఆ లేఖలో ఆరోపించిన విషయాలను చీఫ్‌ జస్టిస్‌ నియమించిన స్వతంత్ర వ్యక్తి నిర్ధారించాల్సిన అవసరముంది. పైగా ఆ లేఖ లోని విషయాలు తప్పు అని జాతికి నిరూపించాల్సిన బాధ్యత కూడా న్యాయవ్యవస్థపైనే ఉంది. పైగా ఆ నిర్ధారణ చాలా పారదర్శకంగా కనిపించాలి కూడా.

భారత రాజ్యాంగాన్ని, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత అంతిమంగా న్యాయవ్యవస్థపైనే ఉంది. దానికోసం న్యాయవ్యవస్థ చాలా బలంగానూ, స్వతంత్రంగానూ పనిచేయాల్సి ఉంటుంది. న్యాయవ్యవస్థ విఫలమైతే ప్రజాస్వామ్యం విఫలమవుతుంది. ఏపీ సీఎం లేఖ వెనుక ఉన్న ఉద్దేశాల గురించి నేను ఊహించి చెప్పలేను. కానీ అలాంటి లేఖ రాయడమన్నదే అత్యంత అసాధారణమైన విషయం. దేశ చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. కార్యదీక్షాపరుడైన రాజకీయనాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఏపీ సీఎం ఇలా అడుగేయడానికి స్పష్టంగానే తగిన కారణాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. సుదీర్ఘకాలం ఆలోచించిన తర్వాతే ఆయన అలాంటి చర్యకు తప్పనిసరై పూనుకుని ఉండవచ్చు. ఏపీ సీఎంపై కేసులు వాయిదాలో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ లేఖ రాశారని కొందరు ఆరోపిస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో మళ్లీ అధికారం చేపట్టడానికి ప్రయత్నిస్తున్నాడని ప్రజలు అభిప్రాయపడుతున్నారు కూడా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక బాధ్యతాయుతమైన, ప్రతిష్ట కలిగిన న్యాయవ్యవస్థ ప్రతినిధి. ఈ విషయంలో ఆయన ఒక తెలివైన, సరైన చర్య తీసుకోగలుగుతారని నా నమ్మకం. జాతి విస్తృత ప్రయోజనాలు, సుప్రీంకోర్టు వంటి ఒక గొప్ప వ్యవస్థ సమగ్రత, స్వాతంత్య్రం పరిరక్షణపై ఆయనకు మంచి సలహాలు అందుతాయని చెప్పడం తప్పితే ఈ అంశంలో ఆయన ఏవైపు అడుగు వేస్తారనే దానిపై నేను ఊహించి చెప్పలేను. ఈ సమస్యను అలా పక్కన పెట్టేయడం కాకుండా సరైన రీతిలో చర్య చేపడతారని నా భావన.

సీనియర్‌ న్యాయమూర్తి కొందరు జడ్జిల పట్ల సానుకూలత ప్రదర్శిస్తున్నారంటూ ప్రస్తుతం వివాదం చెలరేగిన నేపథ్యంలో జడ్జీల నియామకంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టులలో జడ్జీలను కొలీజియం వ్యవస్థ నియమించే పద్ధతిని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. 1992–2003లో ఈ అధికారాన్ని సుప్రీంకోర్టు దఖలుపర్చుకున్నప్పటి నుంచి న్యాయవ్యవస్థ పనితీరు మున్నెన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చిందని భావిస్తున్నాను. అందుబాటులో ఉన్న వారిలో ఉత్తమమైన న్యాయమూర్తులను ఎంపిక చేయడంలో కొలీజీయం విఫలమైంది. ఇలాంటి నియమకాలు చేసేటప్పుడు పూర్తి స్వతంత్రత కలి గిన వ్యవస్థ చాలా అవసరం. దేశంలోని అన్ని అధికారిక సంస్థలు పారదర్శకంగానూ, జవాబుదారీతనంతోనూ ఉండాలని న్యాయవ్యవస్థ నిత్యం గుర్తు చేస్తూనే ఉంటుంది. కానీ తన విషయానికి వచ్చేసరికి న్యాయవ్యవస్థ అత్యంత బాధ్యతారహితమైన, అపారదర్శకమైన వ్యవస్థగా ఉంటోంది. పాలనావిషయానికివస్తే న్యాయవ్యవస్థ అంతర్గత పని విధానం గురించి ఎవరికీ తెలీదు. న్యాయవ్యవస్థ నిగూఢత్వానికి మారుపేరుగా నిలుస్తోంది. 

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గోగోయ్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు కానీ, వాటిని సుప్రీం కోర్టు తోసిపుచ్చడమే కాకుండా అలా ఆరోపించిన మహిళను ఉద్యోగం నుంచి తొలిగించి, కొత్త చీఫ్‌ జస్టిస్‌ వచ్చిన తర్వాతే ఆమెకు తిరిగి ఉద్యోగం కల్పించిన వార్త కానీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. అలాగే అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కలికో పాల్‌ ఆత్మహత్య చేసుకుంటూ ఇద్దరు మాజీ చీఫ్‌ జస్టిస్‌లు జేఎస్‌ కెహర్, దీపక్‌ మిశ్రాలపై ఆరోపించడం, ఆయన భార్య ఈ విషయమై చేసిన ఫిర్యాదును విచారణ లేకుండానే మరుగునపడేయడం కూడా తెలిసిన విషయమే. కానీ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఘటనలో మాత్రం కోర్టు వెంటనే స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించడం గమనార్హం.

ఉన్నత న్యాయస్థానాల్లోని జడ్జీల వ్యక్తిగత ప్రవర్తనను ప్రశ్నించే ఆస్కారమే మన వ్యవస్థలో లేదు. ఇక వారిపై విచారణ గురించి చెప్పపనిలేదు. సుదీర్ఘకాలంలో ఈ పరిస్థితి మార్పు చెందుతుందనడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఏపీ సీఎం జగన్‌ లేఖ అలాంటి యంత్రాం గాన్ని ఏర్పర్చే అవకాశాన్ని న్యాయవ్యవస్థకు అందిస్తోంది. పైగా న్యాయమూర్తులు కూడా చట్టపరిధిలోనే ఉంటారని విశ్వాసం కలిగిస్తూ పౌరుల్లోని భయాలను ఇది తొలగిస్తుంది కూడా. సుప్రీంకోర్టుకు తాను రాసిన లేఖను ఏపీ సీఎం గుట్టుగా ఉంచాలని నేను తప్పక భావిస్తాను. కానీ ఆయన అలా గుట్టుగా పెట్టినా మన మీడియా ప్రతి దాన్నీ బట్టబయలు చేస్తోంది. కాబట్టి ఎంత రహస్యంగా ఉంచినా ఇలాంటివి జనాలకు అనివార్యంగా తెలిసిపోతుంటాయి.

దుష్యంత్‌ దవే 

వ్యాసకర్త సీనియర్‌ న్యాయవాది,
సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు
(ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సౌజన్యంతో)

 

షాక్‌ ట్రీట్‌మెంట్‌..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనౌచిత్యంపై అవినీతిపై, ఏపీ హైకోర్టు జడ్జీలపట్ల పాక్షికత ప్రదర్శించడంపై ఆరోపిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ద్వారా మొత్తం న్యాయవ్యవస్థపైనే బాంబు విసిరారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక, అమరావతి నూతన రాజధాని సరిహద్దులను ప్రకటించిన మధ్యకాలంలో వ్యవసాయ భూముల కొనుగోలు గురించి ఆ లేఖ ప్రస్తావించింది. రాజధాని సరిహద్దులు గుర్తించిన తర్వాత అక్కడి భూములను సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణ కుమార్తెలు కొనుగోలు చేసిన వైనాన్ని పేర్కొంటూనే, రాజధాని సరిహద్దులు గీయక ముందు ఉన్న తక్కువ ధరలతో ఆ భూమిని వారు కొన్నారని, ఆవిధంగా వారికి భారీ ప్రయోజనం సిద్ధించిందని ఏపీ సీఎం లేఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రధాన కార్యదర్శి కేంద్ర మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తూ అమరావతి భూముల కొనుగోలుపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. గత ప్రభుత్వంలో అధికార స్థానాల్లో ఉన్నవారు తమ హోదాను దుర్వినియోగపర్చి రాజధాని సరిహద్దులను తమకు అనుగుణంగా మార్చి తమ బంధువులు, వాణిజ్యవర్గాలు, కుటుంబ సభ్యులు, రాజ కీయ పార్టీ సభ్యులు వాటిని అక్రమంగా కొనుగోలు చేసేలా ప్రేరేపించారని ఆరోపించారు. 

ప్రత్యేకించి రాజకీయంగా సున్నితమైన కేసులను ఏపీ హైకోర్టులో తనకు అనుకూలురైన జడ్జీలకు కేటాయిస్తూ న్యాయవిచారణ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు జడ్జిపై వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. అమరావతి భూముల కుంభకోణంపై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ నివేదికపై అన్ని విచారణలను నిలిపివేయాలని హైకోర్టు అర్థరాత్రి వేళ ఆదేశాలు జారీ చేయడం వెనుక గత ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూల వైఖరి ప్రదర్శించడమే కాకుండా సుప్రీంకోర్టు జడ్జి కుమార్తెలు, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌పై ఆరోపణలపై కూడా స్టే విధింపచేశారని ఏపీ సీఎం తన లేఖలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. యావత్‌ దేశాన్ని నివ్వెరపర్చిన ఈ పరిణామాల నేపథ్యంలో రెండు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. 1. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవినీతిని ఉద్దేశించి రాసిన ఆ లేఖను బహిరంగపర్చవచ్చా? 2. ఈ లేఖ పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందన ఏమిటి? న్యాయమూర్తిపై అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ముగ్గురు న్యాయమూర్తులతో ఇన్‌ హౌస్‌ విచారణ జరపాలని 1997లో ఒక కేసు సందర్భంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని బహిర్గతం చేయరాదని అప్పట్లో కోర్టు పేర్కొంది కానీ ఈ ఆదేశం మాటున జడ్జీలపై వచ్చిన అన్ని అవినీతి ఆరోపణలను ప్రజలకు తెలుపకుండా దాచి ఉంచే మార్గాన్ని న్యాయవ్యవస్థ కనుగొంది.

ఇప్పుడు వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను మీడియాకు బహిరంగపర్చడంపై చర్య తీసుకోవాలని కొందరు పిటిషన్లు వేశారు. కానీ ఒక రాష్ట్ర సీఎంపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టడం వ్యతిరేకఫలితాలను తేవడమే కాకుండా న్యాయవ్యవస్థ ప్రతిష్టకు మరింత నష్టం కలిగించే ప్రమాదం కూడా ఉంది. వైఎస్‌ జగన్‌ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. జడ్డీల ప్రవర్తనా నియమావళికి భంగం కలిగినప్పుడు ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులచే విచారణ చేయాలి. కానీ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి కావలసిన వ్యక్తిపై ఆరోపణలను ఆయనకు కింది స్థానంలోని జూనియర్‌ జడ్డీలు నమ్మదగిన రీతిలో విచారించడం కష్టసాధ్యం అవుతుంది. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోయిపై ఒక మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలపై ఇన్‌ హౌస్‌ విచారణ చేసిన బెంచ్‌ ఆ మహిళ లాయర్‌ని అనుమతించలేదు. న్యాయవిచారణ ప్రక్రియను రికార్డు చేయడానికి కూడా అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం సుప్రీం కోర్టు జడ్డిపై చేసిన ఆరోపణలను అత్యంత విశ్వసనీయత కలిగిన రిటైర్డ్‌ న్యాయమూర్తులతో కూడిన విచారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలి. ఇది మాత్రమే న్యాయవ్యవస్థ ప్రతిష్టను పెంచగలదు.


ప్రశాంత్‌ భూషణ్‌

వ్యాసకర్త సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది
(ది హిందూ సౌజన్యంతో) 

ఆ లేఖ విస్మరించలేనిది..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవినీతి, ఆశ్రిత పక్షపాతంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాసిన లేఖను న్యాయవ్యవస్థ స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమేనని కొట్టిపారేయలేం. ఏపీ హైకోర్టు అనేక సందర్భాల్లో న్యాయదీపంలా కనిపించేది కానీ నేడు రాజ్యవ్యవస్థ మూడు విభాగాల్లో ఒకటైన కార్యనిర్వాహకవర్గం న్యాయవ్యవస్థ పైన, హైకోర్టుపైనే విశ్వాసం కోల్పోయినట్లు కనిపిస్తోంది. తొలి చీఫ్‌ జస్టిస్‌గా, తర్వాత 1966లో 9వ భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ కోకా సుబ్బారావును మర్చిపోగలమా? ఇతర హైకోర్టులకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచిన మన జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డిని మరవగలమా?

ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై పలు ఆరోపణలతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ రాసి సీజేఐకి పంపడం కలవరం కలిగించింది. ఏపీ సీఎంకి న్యాయవ్యవస్థతో తగవు ఉంది కాబట్టి అలాంటి లేఖ రాశారని కొందరు వాదిస్తున్నారు కానీ ఏపీ హైకోర్టు పనితీరును ఎవరూ కప్పిపుచ్చలేరు.  ఏపీ హైకోర్టు సుప్రీం న్యాయమూర్తి విశ్వాసపాత్రుల నియంత్రణలో ఉందని, పైగా తన రాజకీయ ప్రత్యర్థికి అనుకూలంగా తన విధానాలకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తోందని ప్రస్తుత సీఎం ఆరోపణ. ఇక హైకోర్టు వాదన ఏమిటంటే తనకు వ్యతిరేకంగా ఆన్‌ లైన్‌లో జరుగుతున్న ప్రచారానికి కారకులపై రాష్ట్ర పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నదే. 

అదేసమయంలో అమరావతి భూ కుంభకోణంలో పాత్ర ఉన్న మాజీ అడ్వకేట్‌ జనరల్, ఇతర పాత్రధారుల అరెస్టును కోరుతూ దాఖలైన ఎఫ్‌ఐఅర్‌ని సైతం మీడియాలో ప్రచురించరాదని అర్థరాత్రి ఆదేశాలు చేసిన హైకోర్టు వ్యవహారం చాలామందిని కలపరపర్చింది. మాజీ అడ్వకేట్‌ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల పేర్లు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ పైనే నిషేధం విధించడం న్యాయవ్యవస్థ చరిత్రలో కనీవినీ ఎరుగనిది.  
అంతకుమించి అనేక కేసుల్లో హైకోర్టు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వం ఏమాత్రం సంతోషంగా లేదు. పైగా హైకోర్టు ఆదేశాల పట్ల వ్యాఖ్యానాలు చేసిన ఎంపీ, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ పట్ల కూడా కోర్టు ధిక్కార చర్య కింద విచారణకు ఆమోదం తెలుపడంతో న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వర్గానికి మధ్య మరింత ఆజ్యం పోసినట్లయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా హైకోర్టు వ్యవహరిస్తోందని ఏపీ సీఎం ఆరోపించడం, హైకోర్టు పట్ల ప్రభుత్వం శత్రుపూరిత వైఖరిని అవలంబిస్తోందని హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దఖలు కావడం రెండు రాజ్యాంగ సంస్థల మధ్య సఖ్యత లేదని స్పష్టం చేస్తున్నాయి. 

హైకోర్టుపై దాఖలైన రిట్‌ పిటిషన్‌ వెనుక రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా మాజీ యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ హస్తముందని హైకోర్టు భావించడంతో రెండు రాజ్యాంగ సంస్థల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయి. మాజీ యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సస్పెండైన న్యాయమూర్తితో మాట్లాడిన సంభాషణలన్నీ ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా సాగించిన కుట్రలో భాగమేనని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు భావించింది. రాజ్యాంగంలోని 226వ అధికరణ కింద తనకున్న అధికారాలను వినియోగించుకుని విచారించి, ఈ విషయంలో విచారణ చేయమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ను కోరింది. ఆయన ఈ కేసులోని నిజానిజాలను, సంభాషణలను నిగ్గుతేల్చాలని కోరింది. మూడో పక్షం ప్రయోజనాలను కూడా నిగ్గుతేల్చాలని ఆయనకు సూచించింది. మొత్తంమీద చూస్తే ఏపీ హైకోర్టు వ్యవహారాలు సజావుగా సాగటం లేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం రాసిన లేఖను ఒక విడి చర్యగా భావించలేం. పైగా దీన్ని న్యాయవ్యవస్థ స్వతంత్రతలో జోక్యం చేసుకుంటున్న వ్యవహారంగా తోసిపుచ్చలేం కూడా. 
కృష్ణప్రసన్న వైట్ల, న్యాయశాస్త్ర విద్యార్థి
(ది హిందూ సౌజన్యంతో) 

 

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top